టాలీవుడ్ ఎగ్జిబిటర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో బుధవారం జరిగిన ఫిల్మ్ ఛాంబర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం ఒక కీలక ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. ఏ సినిమా అయినా థియేటర్లో విడుదలైన 8 వారాల (56 రోజులు) తర్వాతే ఓటీటీలోకి రావాలనేది ఈ ప్రతిపాదన సారాంశం. అయితే, ఇది వినడానికి బాగున్నా, క్షేత్రస్థాయిలో దీని అమలుపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read : Tollywood Actors : టాలీవుడ్ హీరోల పెళ్ళిలు ఎవరు ఏ వయసులో చేసుకున్నారో తెలుసా
బాలీవుడ్‌లో 8 వారాల విండో సక్సెస్‌ఫుల్‌గా నడవడానికి ప్రధాన కారణం అక్కడి మల్టీప్లెక్స్ చైన్స్. హిందీ మార్కెట్‌లో దాదాపు 60-75% రెవెన్యూ ఈ మల్టీప్లెక్స్‌ల నుంచే వస్తుంది. ఒకవేళ ఏ నిర్మాత అయినా 8 వారాల కంటే ముందే ఓటీటీకి ఇస్తానంటే, ఆ సినిమాను ప్రదర్శించవు. అందువల్ల అక్కడ ఆ నిబంధన అమలవుతోంది. కానీ తెలుగులో అలా కాదు. ఇక్కడ పెద్ద పెద్ద ఎగ్జిబిటర్లే నిర్మాతలుగా కూడా ఉన్నారు. 8 వారాల గ్యాప్ పెడితే ఓటీటీ నుంచి వచ్చే భారీ డీల్స్ తగ్గుతాయి. ఒకవేళ థియేటర్లో సినిమా ఫ్లాప్ అయితే, ఆ నిర్మాతకు ఓటీటీ మనీయే పెద్ద దిక్కు. అటువంటప్పుడు తమకు లాభం చేకూర్చే ఓటీటీ రెవెన్యూను వారు వదులుకుంటారా? అనేది పెద్ద ప్రశ్న. తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్లు ఎక్కువ. మల్టీప్లెక్స్‌ల ప్రభావం హిందీ అంతగా లేదు. కాబట్టి ఇక్కడ ఎగ్జిబిటర్లు నిర్మాతల మీద ఒత్తిడి తెచ్చే స్థితిలో లేరు. ప్రస్తుతానికి ఇది కేవలం ఛాంబర్ చేసిన ప్రతిపాదన మాత్రమే. దీనిపై ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మరియు యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ సభ్యులు కూర్చుని చర్చించాల్సి ఉంది. ఓటీటీ సంస్థలు ఇచ్చే రేట్లు అగ్రిమెంట్లలోని ‘విండో పీరియడ్’ (గ్యాప్) మీద ఆధారపడి ఉంటాయి. 8 వారాలు అంటే ఓటీటీ రేట్లు తగ్గే ప్రమాదం ఉందని నిర్మాతలు భావిస్తున్నారు. బాలీవుడ్ లాగా ఇక్కడ ‘ఫోర్స్’ (Enforce) చేసే పరిస్థితి లేదు. కేవలం అందరూ ఏకాభిప్రాయానికి వస్తేనే ఇది సాధ్యం. మరి మన టాలీవుడ్ నిర్మాతలు తమ ఓటీటీ ఆదాయాన్ని పక్కన పెట్టి, థియేటర్ల మనుగడ కోసం ఈ 8 వారాల రూల్‌కు కట్టుబడతారా? అనేది వేచి చూడాలి.
