సంక్రాంతి సెలవులు వచ్చాయంటే చాలు సొంతూళ్లకు పయనమవుతారు. ఈ క్రమంలో.. హైదరాబాద్-విజయవాడ రహదారిపై వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. హైదరాబాద్ నుంచి పల్లెలకు వాహనాలు బారులు తీరాయి. ప్రతీసారి ఉన్నట్లే భారీ వాహనాల రద్దీతో గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోతుంది. సంక్రాంతి సందర్భంగా సొంత ఊర్లకు పయనమైన వాహనాలతో టోల్ ప్లాజాల దగ్గర వాహనాల రద్దీ కొనసాగుతోంది. నిన్న రాత్రి నుంచి ఇప్పటివరకు కూడా టోల్ గేట్స్ దగ్గర వాహనాల తాకిడి భారీగా ఉంది. ఏపీ బార్డర్ జగ్గయ్యపేట దగ్గర చిలకల్లు, నందిగామ దగ్గర కీసర, గన్నవరం దగ్గర పొట్టిపాడు చెక్ పోస్టుల దగ్గర వాహనాల రద్దీ నెలకొంది. దీంతో సాధారణ రోజుల కంటే ఎక్కువ గేట్లను అందుబాటులో తెచ్చి వాహనాలను అనుమతి పంపిస్తున్నారు. రోజుకి సాధారణ రోజుల్లో 15 వేల వాహనాలు టోల్ గేట్ల నుంచి బయటకు వెళ్తుండగా.. ఇప్పుడు పండగ సీజన్ కావటంతో వాటి సంఖ్య 40,000 వరకు ఉంటుందని టోల్ గేట్ సిబ్బంది చెబుతున్నారు.
Read Also: Bobby : బాలయ్య గుర్రపు స్వారీ చూసి మేము షాక్ అయ్యాం
విజయవాడ నగరంలో ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది.. ఇతర ప్రాంతాల నుంచి విజయవాడ వైపుకు వస్తున్న వాహనాలతో నగరంలోని ప్రధాన రహదారులు కిక్కిరిసిపోతున్నాయి. ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో రోడ్డుపై రెండు వైపులా భారీగా వాహనాలు నిలిచిపోతున్నాయి. వారధి వైపు నుంచి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, ఉభయ గోదావరి జిల్లాల వాహనాలు నగరంలోకి వస్తున్నాయి. అదే విధంగా హైదరాబాద్ హైవే నుంచి నగరంలోకి వచ్చి ఉభయ గోదావరి, విశాఖ వైపుకు భారీగా వాహనాలు తరలి వెళ్తున్నాయి. దీంతో వేల సంఖ్యలో వాహనాలు నగరం లోకి రావటంతో ట్రాఫిక్ తో రోడ్లు నిండిపోతున్నాయి.