Today stock Market Roundup 17-04-23: దేశీయ స్టాక్ మార్కెట్‌కి ఈ వారం శుభారంభం లభించలేదు. వరుసగా 9 రోజులు వచ్చిన లాభాలకు బ్రేక్ పడింది. ఇవాళ సోమవారం ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమై సాయంత్రం కూడా నష్టాలతోనే ముగిసింది. బెంచ్ మార్క్ ఇండెక్స్‌లు ఒక శాతానికి పైగా పడిపోయాయి.
read more: Telangana Exports: తెలంగాణకు సముద్ర తీరం లేకపోయినా..
ఇన్ఫోసిస్, టెక్ మహింద్రా, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, విప్రో తదితర ఐటీ స్టాక్స్ సరైన పనితీరు కనబరచకపోవటమే దీనికి కారణం. అయితే.. బ్యాంకులు మరియు ఎఫ్ఎంసీజీ షేర్ల కొనుగోలుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపటంతో ఇంట్రాడేలో వచ్చిన భారీ నష్టాల నుంచి కాస్త కోలుకున్నాయి.
చివరికి.. సెన్సెక్స్ 520 పాయింట్లు కోల్పోయి 59 వేల 910 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ.. 121 పాయింట్లు తగ్గి 17 వేల 706 పాయింట్ల వద్ద ఎండ్ అయింది. సెన్సెక్స్‌లోని మొత్తం 30 కంపెనీల్లో 18 కంపెనీలు లాభాల బాట పట్టగా మిగతా 12 కంపెనీలు నష్టాలను చవిచూశాయి.
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ప్రధానంగా నెస్లె ఇండియా, ఏసియన్ పెయింట్స్ మెరవగా.. టాటా స్టీల్ విప్రో నేల చూపులు చూశాయి. నిఫ్టీ 50లో బెస్ట్ పెర్‌ఫార్మింగ్ స్టాక్‌గా ఐటీసీ నిలిచింది. ఈ సంస్థ షేరు విలువ ఏడాది కాలంలో 48 శాతానికి పైగా పెరిగింది. ఇవాళ 400 రూపాయలు దాటింది.
భవిష్యత్తులో 500 రూపాయలను కూడా క్రాస్ చేయనుందని పెట్టుబడిదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 10 గ్రాముల బంగారం రేటు 246 రూపాయలు పెరిగింది. అత్యధికంగా 60 వేల 575 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. కేజీ వెండి ధర 308 రూపాయలు పెరిగి.. గరిష్టంగా 76 వేల 45 రూపాయలు పలికింది.
క్రూడాయిల్ రేటు నామమాత్రంగా 23 రూపాయలు తగ్గింది. ఒక బ్యారెల్ ముడి చమురు 6 వేల 744 రూపాయలుగా నమోదైంది. రూపాయి వ్యాల్యూ 13 పైసలు బలహీనపడింది. డాలరుతో పోల్చితే 82 రూపాయల 2 పైసల వద్ద స్థిరపడింది.