NTV Telugu Site icon

Today Business Headlines 29-04-23: అల్లుడిపై అత్త జోక్. రిషి సునాక్‌పై సుధామూర్తి సరదా వ్యాఖ్య

Today Business Headlines 29 04 23

Today Business Headlines 29 04 23

Today Business Headlines 29-04-23:

ఎల్ఐసీ చైర్మన్‌గా

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.. ఎల్ఐసీకి పూర్తి స్థాయి చైర్మన్‌గా సిద్ధార్థ మొహంతి నియమితులయ్యారు. ఈ సంస్థకు ప్రస్తుతం ఈయనే ఎండీగా మరియు తాత్కాలిక చైర్మన్‌గా ఉన్న సంగతి తెలిసిందే. సిద్ధార్థ మొహంతి ఈ పదవిలో 2025 జూన్ 7 వరకు.. అంటే.. ఆయనకు 62 ఏళ్ల వయసు వచ్చే వరకు ఉంటారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఇదిలాఉండగా.. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా.. IRDAIకి లైఫ్ టైమ్ సభ్యుడిగా ఎల్ఐసీ మాజీ ఎండీ బీసీ పట్నాయక్‌ని నియమించారు.

‘‘కార్వీ’’పై నిషేధం

స్టాక్ బ్రోకింగ్ కంపెనీ కార్వీపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా.. సెబీ.. ఏడేళ్లపాటు నిషేధం విధించింది. ఆ సంస్థ ప్రమోటర్ అండ్ ఎండీ పార్థసారథికి కూడా ఇదే వర్తిస్తుందని స్పష్టం చేసింది. సెక్యూరిటీ మార్కెట్లలో కార్యకలాపాలు నిర్వహించటానికి వీల్లేదని తేల్చిచెప్పింది. క్లయింట్ల డబ్బులను మరియు పవర్ ఆఫ్ అటార్నీని దుర్వినియోగం చేసినందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేరానికి గాను కార్వీ కంపెనీ 13 కోట్లు, పార్థసారథి 8 కోట్ల రూపాయల చొప్పున పెనాల్టీ కట్టాలని ఆదేశించింది.

‘జెట్’కి.. బైబై..

జెట్ ఎయిర్‌వేస్ సీఈఓ పదవికి సంజీవ్ కపూర్ రాజీనామా చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఆయనకు నిన్న శుక్రవారమే చివరి వర్కింగ్ డే అంటున్నారు. సంజీవ్ కపూర్ సరిగ్గా ఏడాది కిందట జెట్ ఎయిర్‌వేస్ సీఈఓగా చేరారు. కానీ.. అప్పటికి రెండేళ్ల కిందటే ఈ సంస్థ తన కార్యకలాపాలను నిలిపేసింది. ప్రస్తుతం దివాలా పరిష్కార ప్రక్రియ కొనసాగుతోంది. ఇది ఒక కొలిక్కి రాకముందే ఆయన తన పదవి నుంచి తప్పుకున్నారు. అయితే.. ఈ రాజీనామా విషయానికి సంబంధించి సంజీవ్ కపూర్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందనా రాలేదు.

నా బిడ్డ వల్లే..

ఇన్ఫోసిస్ కోఫౌండర్ నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి ఒక ప్రైవేట్ ప్రోగ్రామ్‌లో మాట్లాడుతూ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లారు. తన భర్తను తాను ఎట్లయితే బిజినెస్‌మ్యాన్‌ని చేశానో తన కుమార్తె అక్షతమూర్తి కూడా ఆమె భర్త రిషి సునాక్‌ని అలాగే వెనకుండి నడిపించారని చెప్పారు. తన కుమార్తె వల్లే రిషి సునాక్ బ్రిటన్ ప్రధానమంత్రి అయ్యారంటూ జోక్ చేశారు. ఎంట్రప్రెన్యూర్ కావాలనే నారాయణమూర్తి కలను సుధామూర్తి సాకారం చేసిన సంగతి తెలిసిందే. తాను దాచుకున్న పది వేల రూపాయలిచ్చి ఆయన చేత సొంత సంస్థ ఇన్ఫోసిస్‌ని ప్రారంభించేలా చేశారు.

మరో బ్యాంక్

అమెరికాలో మరో బ్యాంక్ ఆర్థికంగా కుప్పకూలిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ షేర్ల విలువ నిన్న శుక్రవారం ఏకంగా 50 శాతం డౌన్ అయింది. దీంతో స్టాక్ ఎక్స్ఛేంజ్‌లు ఈ భారీ పతనాన్ని అడ్డుకునేందుకు సంస్థ షేర్ల ట్రేడింగ్‌కి పలుమార్లు బ్రేకులు వేయాల్సి వచ్చింది. ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్‌ని కంటిన్యూ చేసే సూచనలు లేవని, ఏ క్షణంలోనైనా మూసేసే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. అమెరికాలో ఇప్పటికే సిలికాన్ వ్యాలీ మరియు సిగ్నేచర్ బ్యాంక్‌లు పతనమయ్యాయి.

ఎక్స్‌పోర్ట్స్ రికార్డ్

ఇండియాకి రష్యా నుంచి జరిగిన ఎగుమతులు ఆల్‌టైం రికార్డ్ ‌లెవల్‌కి చేరుకున్నాయి. 2022-23లో ఈ ఎక్స్‌పోర్ట్‌ల విలువ 4 వేల 160 కోట్ల డాలర్లుగా నమోదైంది. ఈ వివరాలను కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. రష్యా నుంచి మన దేశానికి ఒక ఏడాదిలో జరిగిన ఎగుమతులు 4 వేల కోట్ల డాలర్లు దాటడం ఇదే మొదటిసారి. రష్యా నుంచి భారతదేశానికి క్రూడాయిల్ ఎక్కువగా ఎగుమతి జరగటమే దీనికి ప్రధాన కారణం. 2021-22తో పోల్చితే 2022-23 నాటికి ఈ ఎక్స్‌పోర్ట్‌లు నాలుగు రెట్లకు పైగా పెరిగాయి.