NTV Telugu Site icon

Today Business Headlines 27-03-23: మనమే ‘ఎక్స్‌-రే’ చేసుకుందాం. మరిన్ని వార్తలు

Today Business Headlines 27 03 23

Today Business Headlines 27 03 23

Today Business Headlines 27-03-23:

టీసీఎస్‌ రాజన్నకు అవార్డు

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ కంపెనీ రీజనల్‌ హెడ్‌ మరియు సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ వి.రాజన్నకు లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు లభించింది. హైదరాబాద్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ ఈ పురస్కారంతో ఆయన్ని సత్కరించింది. రాజన్నకు సాఫ్ట్‌వేర్‌ సెక్టార్‌లో 30 ఏళ్లకు పైగా విశేష అనుభవం ఉంది. ఆ సుదీర్ఘ అనుభవం తెలంగాణ ఐటీ రంగం అభివృద్ధికి మరియు రాష్ట్ర ఆర్థిక పురోగతికి ఎంతగానో తోడ్పడుతుందని అసోసియేషన్‌ పేర్కొంది. ఈ సందర్భంగా రాజన్న మాట్లాడుతూ.. ఇండస్ట్రీ డెవలప్‌మెంట్‌కి, నైపుణ్యాల పెంపునకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు.

‘క్లియర్‌’కి హృతిక్ ప్రచారం

మంచి నీళ్ల సీసాలను విక్రయించే క్లియర్‌ అనే సంస్థ తమ బ్రాండ్‌ అంబాసిడర్‌గా బాలీవుడ్‌ హీరో హృతిక్ రోషన్‌ని నియమించుకుంది. ఈ కంపెనీ.. ప్రీమియం ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ బాటిల్స్‌ బిజినెస్‌ చేస్తోంది. మోడ్రన్‌ టెక్నాలజీతో నీటిని శుద్ధి చేసి అమ్ముతోంది. ఈ మేరకు లేటెస్ట్‌ మెషినరీతో ఒక ప్లాంటును కూడా ప్రారంభించింది. ఎయిర్‌లైన్స్‌ మరియు హోటల్స్‌కి తమ ప్రొడక్టులను సప్లై చేస్తోంది. హృతిక్ రోషన్‌ని ప్రచారకర్తగా నియమించుకోవటం ద్వారా నేషనల్‌ లెవల్‌లో సంస్థకు మంచి గుర్తింపు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.

నామినీకి గడువు ఈ నెల 31

మ్యూచ్‌వల్‌ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టినవారికి ముఖ్య గమనిక. వాళ్లు ఈ నెల 31వ తేదీ లోపు నామినీ వివరాలు ఇవ్వాలి. లేకపోతే.. అకౌంట్లు స్తంభించిపోతాయని సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా.. సెబీ.. హెచ్చరించింది. ఇదే జరిగితే.. ఇన్నాళ్లూ పెట్టిన డబ్బులు, వాటి మీద రావాల్సిన లాభాలు దక్కవు. ఒకవేళ నామినీ వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేకపోతే కనీసం ఆ విషయాన్నైనా తెలియజేయాలని సెబీ సూచించింది. ఈ మేరకు గతేడాది జూన్‌ 15న జీవో ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ గడువును.. తర్వాత రెండు సార్లు పొడిగించింది. తాజాగా.. ఈ నెల 31 తేదీని చివరి తేదీగా నిర్ధారించింది.

‘రెపో’ 0.25% పెరిగే ఛాన్స్‌

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా.. వడ్డీ రేట్లను పావు శాతం పెంచే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. రెపో రేటును సున్నా పాయింట్‌ రెండూ ఐదు శాతం పెంచుతూ ఏప్రిల్‌ 6వ తేదీన ప్రకటన చేసే సూచనలు ఉన్నాయని తెలుస్తోంది. తదుపరి ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యుల సంఘం వచ్చే నెల 3, 5, 6 తేదీల్లో సమావేశం కానుంది. అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలు ఇప్పటికే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. మన దేశంలో కూడా ధరలు ఇంకా అదుపులోకి రాకపోవటంతో వడ్డీ రేట్లను పెంచకతప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

15%కి దిగుమతి సుంకం

ఎక్స్‌రే మెషిన్ల దిగుమతి సుంకం ఏప్రిల్‌ నుంచి 15 శాతానికి పెరగనుంది. ప్రస్తుతం ఇది 10 శాతంగా అమలవుతోంది. నాన్‌-పోర్టబుల్‌ ఎక్స్‌-రే జనరేటర్ల కస్టమ్స్‌ డ్యూటీ కూడా 10 నుంచి 15 శాతానికి చేరనుంది. శుక్రవారం లోక్‌సభలో ఆమోదం పొందిన ఫైనాన్స్‌ బిల్లు సవరణల వల్ల ఈ పన్నుల రేటు పెరిగింది. అయితే.. ఈ పరిణామం మన దేశానికి మంచి చేయనుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఈ నిర్ణయం మేకిన్‌ ఇండియాకి ఊతంగా నిలుస్తుందని పేర్కొన్నాయి. ఎక్స్‌రే పరికరాల కోసం దిగుమతులపై ఆధారపడకుండా ఇండియాలోనే తయారుచేసుకునేందుకు దోహదపడుతుందని అభిప్రాయపడ్డాయి.

వివాదంలో.. ఫిజిక్స్‌వాలా

ఎడ్‌టెక్‌ సంస్థ ఫిజిక్స్‌వాలా వివాదంలో చిక్కుకుంది. ఆ కంపెనీకి చెందిన ముగ్గురు టీచర్లు ఇటీవల విడుదల చేసిన ఒక వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో.. వాళ్లు.. బోరున విలపిస్తూ కనిపించటం చర్చనీయాంశమైంది. తమపై వచ్చిన లంచం ఆరోపణలను టీచర్లు తీవ్రంగా ఖండించారు. అవి నిరాధారమైనవని స్పష్టం చేశారు. దాంతోపాటు కంపెనీలో చోటుచేసుకున్న అంతర్గత రాజకీయాలను కూడా వాళ్లు వెల్లడించారు. తాము 5 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నామని, ఫిజిక్స్‌వాలా సంస్థలో బోధన మరియు అభ్యసనకు సంబంధించి సరైన వాతావరణం లేదని, అందుకే తాము ఉద్యోగం మానేశామని చెప్పినట్లుగా వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజంలేదని అన్నారు.