Today Business Headlines 18-04-23:
తగ్గిన టోకు ధరలు
మార్చి నెలలో టోకు ద్రవ్యోల్బణం 29 నెలల కనిష్టానికి దిగొచ్చింది. తయారీ మరియు ఇంధన ఉత్పత్తుల రేట్లు తగ్గటంతో ఇది సాధ్యమైంది. ఫలితంగా హోల్ సేల్ ప్రైస్ ఇండెక్స్ ఒకటీ పాయింట్ మూడు నాలుగు శాతంగా నమోదైంది. WPI ద్రవ్యోల్బణం వరుసగా పదో నెల కూడా తగ్గటం చెప్పుకోదగ్గ విషయం. 2020వ సంవత్సరం అక్టోబర్ తర్వాత ఇదే కనిష్ట స్థాయి. అప్పుడు.. టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం ఒకటీ పాయింట్ మూడు ఒకటిగా నమోదైంది. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది మార్చి నెలలో ఆహార ధరలు మాత్రం పెరిగాయి.
ఫార్మాక్సిల్ టార్గెట్
మరో ఏడేళ్లలో.. అంటే.. 2030 నాటికి ఆరున్నర లక్షల కోట్ల రూపాయలకు పైగా విలువైన ఫార్మా ఎగుమతులు సాధించాలని ఫార్మాక్సిల్ లక్ష్యంగా పెట్టుకుంది. ఫార్మాక్సిల్ అంటే.. ఔషధ ఎగుమతుల ప్రోత్సాహక మండలి అని అర్థం. ఫార్మా ఎక్స్‌పోర్ట్‌లను పెంచేందుకు ఈ సంస్థ పలు చర్యలు చేపడుతోంది. ఔషధ సంస్థలకు ఎగుమతులపై అవగాహన పెంచటానికి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఫార్మా ఎక్స్‌పోర్ట్‌లు అంతకుముందు ఏడాదితో పోల్చితే 3 పాయింట్ నాలుగు ఐదు శాతం పెరిగి 2 లక్షల కోట్ల రూపాయలకు పైగా చేరాయి.
రేపు ప్రధానితో భేటీ
యాపిల్ సంస్థ సీఈఓ టిమ్ కుక్ రేపు బుధవారం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవనున్నారు. కేంద్ర ఐటీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌తో సైతం భేటీ అవుతారు. ముంబైలో యాపిల్ రిటైల్ స్టోర్ ప్రారంభోత్సవం కోసం ఆయన మొన్న ఆదివారం ముంబైకి చేరుకున్నారు. అనంతరం.. అంబానీ ఫ్యామిలీతోపాటు మరికొంత మంది సెలెబ్రిటీలను కలిశారు. ఇందులో.. మ్యూజిక్ మ్యాస్ట్రో ఏఆర్ రెహ్మాన్, బాలీవుడ్ హీరోయిన్లు మాధురీ దీక్షిత్, రవీనా టాండన్ వంటివాళ్లు ఉన్నారు.
గోఫస్ట్‌కి.. గుడ్‌బై?
ఇండియన్ ఎయిర్‌లైన్ గోఫస్ట్‌లోని వాటాను విక్రయించేందుకు (లేదా) ఆ సంస్థతో ఉన్న భాగస్వామ్యం నుంచి పూర్తిగా వైదొలిగేందుకు వాడియా గ్రూపు చర్చలు జరుపుతోంది. గోఫస్ట్ సంస్థ 2022 ఆర్థిక సంవత్సరంలో భారీ వార్షిక నష్టాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత కూడా కొన్ని నెలలుగా ఆపరేషనల్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో వాడియా గ్రూపు మరింత పెట్టుబడి పెట్టే విషయంలో పునరాలోచనలో పడింది. అయితే.. ఈ వార్తలపై ఈ రెండు సంస్థలు ఇంకా స్పందించలేదు. వాడియా గ్రూపు.. బాంబే డయింగ్ వంటి సంస్థలను నడుపుతున్న సంగతి తెలిసిందే.
సీఈఓల మార్పులు
వచ్చే ఏడాది కాలంలో వివిధ సంస్థలు తమ సీఈఓలను మార్చే యోచనలో ఉన్నాయి. ఈ కంపెనీల ఉమ్మడి మార్కెట్ విలువ ఏకంగా 465 బిలియన్ డాలర్లు కావటం విశేషం. ఈ సంస్థల జాబితాలో ఎస్‌బీఐ, టీసీఎస్, హెచ్‌యూఎల్ వంటివి ఉన్నాయి. సీఈఓలను మార్చటం ద్వారా సంస్థల వ్యాపార వ్యూహాలు, ఆలోచనలు, విలువలు, సంస్కృతి మరియు స్టాక్స్ పనితీరు మెరుగుపడతాయని ఆశిస్తున్నాయి. తద్వారా.. కంపెనీల విస్తరణకు, పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరగటానికి దోహదపడుతుందని పేర్కొంటున్నాయి.
యాపిల్ @ ముంబై
ఇండియాలో యాపిల్ కంపెనీ మొదటి రిటైల్ స్టోర్ ఇవాళ ప్రారంభం కానుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఏర్పాటు చేసిన ఈ స్టోర్‌ని సంస్థ సీఈఓ టిమ్ కుక్ అందుబాటులోకి తేనున్నారు. అమెరికా టెక్ దిగ్గజ సంస్థ అయిన యాపిల్.. ముంబైలోని బీకేసీ బిజినెస్ డిస్ట్రిక్ట్‌లో 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ స్టోర్‌ని లాంఛ్ చేస్తోంది. ఈ సందర్భంగా సీఈఓ టిమ్ కుక్ స్వయంగా కస్టమర్లకు స్వాగతం పలుకుతారు. భారతదేశంలో ఫస్ట్ స్టోర్‌ని ప్రారంభించనుండటం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.