Today (29-12-22) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్ ఎట్టకేలకు ఇవాళ కోలుకుంది. నిన్న బుధవారం నష్టాల్లో ముగిసిన రెండు సూచీలు ఇవాళ శుక్రవారం ఉదయం కూడా నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి. కానీ మధ్యాహ్నం తర్వాత లాభాల బాటలోకి వచ్చి చివరికి లాభాల్లోనే ముగిశాయి. ఎర్లీ ట్రేడింగ్‌లో గ్లోబల్ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వెలువడటంతో వరుసగా రెండో రోజు కూడా బిజినెస్ లాస్‌లోనే నడుస్తుందా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.
కానీ సెకండాఫ్‌లో సెలెక్టెడ్ బ్యాంకులు, మెటల్ షేర్లు పుంజుకొని లాభాలు ఆర్జించటంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సెన్సెక్స్ 223 పాయింట్లు పెరిగి 61 వేల 133 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 87 పాయింట్లు లాభపడి 18 వేల 210 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లోని మొత్తం 30 స్టాక్స్‌లో భారతీ ఎయిర్‌టెల్, ఎస్‌బీఐ 2 శాతానికి పైగా ర్యాలీ తీశాయి. యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, సన్ ఫార్మా సంస్థల షేర్లు కూడా బాగానే రాణించాయి.
read also: Gold Shine in 2023: వచ్చే ఏడాది.. మాంద్యం వచ్చినా.. రాబడి తగ్గినా.. నో ఎఫెక్ట్..
మరో వైపు.. టాటా మోటార్స్, టైటాన్ స్టాక్స్ విలువ ఒక శాతం కన్నా ఎక్కువే పడిపోయింది. నిఫ్టీలో ఎయిర్‌టెల్, ఎస్‌బీఐ, ఐషర్ మోటర్స్ 2 శాతానికి పైగా లాభపడి టాప్ లెవల్‌లో నిలిచాయి. సరెగమ ఇండియా, శ్రీరామ్ ఫైనాన్స్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, శ్రీసిమెంట్, కల్యాణ్ జ్యూలర్స్ నష్టాలు చవిచూశాయి. రంగాల వారీగా చూస్తే మెటల్ అండ్ ఎనర్జీ ఇండెక్స్‌లు ఒక శాతానికి పైగా పెరిగాయి. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ మరియు క్యాపిటల్ గూడ్స్ సూచీలు సుమారు అర శాతం తగ్గాయి. ఫార్మా రంగం సైతం నష్టపోయింది.
10 గ్రాముల బంగారం ధర నామమాత్రంగా 16 రూపాయలు పెరిగి గరిష్టంగా 54 వేల 777 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. కేజీ వెండి రేటు అతి స్వల్పంగా 16 రూపాయలు ప్లస్ అయి 69 వేల 30 రూపాయలు పలికింది. రూపాయి వ్యాల్యూ 7 పైసలు తగ్గింది. డాలరుతో పోల్చితే మారకం విలువ 82 రూపాయల 79 పైసలుగా నమోదైంది.
