NTV Telugu Site icon

Today (23-01-23) Business Headlines: ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలపై తగ్గిన ఫోకస్‌. మరిన్ని వార్తలు

Today (23 01 23) Business Headlines

Today (23 01 23) Business Headlines

Today (23-01-23) Business Headlines:

జూన్ కల్లా ‘విశాఖ’ విస్తరణ

హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌.. విశాఖపట్నంలో చేపట్టిన చమురు శుద్ధి కర్మాగారం విస్తరణ పనులను జూన్‌ చివరికి పూర్తిచేయనుంది. ఈ రిఫైనరీ ప్రస్తుత ప్రొడక్షన్‌ కెపాసిటీ 83 పాయింట్‌ 3 లక్షల టన్నులు కాగా దాన్ని దాదాపు రెట్టింపునకు.. అంటే.. ఒకటిన్నర కోట్ల టన్నులకు చేర్చుతున్నారు. ఈ విషయాలను HPCL చైర్మన్‌ పుష్ప్‌ జోషి వెల్లడించారు. ఈ సంస్థ ఇప్పుడు తన ఉత్పత్తి సామర్థ్యం కన్నా 50 శాతం ఎక్కువ పెట్రోల్‌, డీజిల్‌ మరియు LPG విక్రయిస్తోంది. విశాఖ రిఫైనరీ పూర్తి స్థాయిలో మరియు రాజస్థాన్‌లోని రిఫైనరీ కొత్తగా అందుబాటులోకి వస్తే ప్రొడక్షన్‌, సేల్స్‌ మధ్య వ్యత్యాసం భర్తీకానుందని చెప్పారు.

టికెట్‌ రేట్ రూ.1705 నుంచి

జీవితంలో ఒక్కసారైనా విమానం ఎక్కాలని.. అది కూడా తక్కువ ఖర్చుతో పూర్తిచెయ్యాలని కోరుకునే మధ్యతరగతి ప్రయాణికులకు మంచి అవకాశం వచ్చింది. ఈ ఛాన్స్‌ వాడుకోవాలనుకునేవారు తొందరపడటం బెటర్‌. ఎందుకంటే ఈ ప్రయాణానికి టికెట్‌ బుక్‌ చేసుకునేందుకు ఇవాళే చివరి రోజు. ఈ బంపరాఫర్‌ని ఎయిరిండియా అందిస్తోంది. టికెట్‌ ప్రారంభ ధర 17 వందల ఐదు రూపాయలు మాత్రమేనని తెలిపింది. ఫిబ్రవరి ఒకటి నుంచి సెప్టెంబర్‌ 30 వరకు మధ్యలో ఎప్పుడైనా జర్నీ చేయాలనుకునేవారు టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చని సూచించింది. దేశంలోని 49 రూట్లలో ప్రయాణానికి ఈ రాయితీ వర్తిస్తుందని ఎయిరిండియా స్పష్టం చేసింది.

మూలధన సాయం కష్టమే!

ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరు, ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉండటంతో వీటికి కొత్త బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం మూలధన సాయం చేసే అవకాశంలేదని తెలుస్తోంది. పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకులు ఈ ఆర్థిక సంవత్సరంలో ఏకంగా లక్ష కోట్ల రూపాయల లాభాన్ని నమోదు చేసే సూచనలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. బ్యాంకుల అడిక్వసీ రేషియో ఉండాల్సినదానికన్నా 14 నుంచి 20 ఎక్కువే ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. కేంద్ర ప్రభుత్వం చివరిసారిగా గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు 20 వేల కోట్ల రూపాయల క్యాపిటల్‌ ఫండ్‌ అందించింది.

జొమాటో ఏజెంట్‌ మోసం

ఫుడ్‌ డెలివరీ ఏజెంట్‌ చేసిన మోసం గురించి తనకు తెలుసని, సంస్థలో ఇలాంటి లోటుపాట్లను పూడ్చేందుకు చర్యలు చేపడుతున్నామని జొమాటో CEO దీపిందర్‌ గోయెల్‌ తెలిపారు. ఫుడ్‌ ఆర్డర్‌కి చెల్లించాల్సిన డబ్బు మొత్తం కంపెనీకి ఇవ్వాల్సిన అవసరంలేదని, కొంత తనకు ఇస్తే చాలంటూ ఒక డెలివరీ ఏజెంట్‌ ఓ కస్టమర్‌కి ఉచిత సలహా ఇచ్చాడు. ఆ వినియోగదారుడు ఒక ఎంట్రప్రెన్యూర్‌ కావటం, డెలివరీ ఏజెంట్‌ వ్యవహార శైలి మోసపూరితంగా అనిపించటంతో లింక్డిన్‌ ద్వారా జొమాటో CEO దృష్టికి తీసుకొచ్చారు. దీనికి ఆయన పైవిధంగా స్పందించారు.

పాక్‌లో దుబారా ఖర్చులు

మన పొరుగు దేశం పాకిస్థాన్‌ కొన్నాళ్లుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. విదేశీ మారక నిల్వలు అతి తక్కువ స్థాయికి.. అంటే.. 4 బిలియన్‌ డాలర్లకు పడిపోయాయని సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో ఆ దేశ కేంద్ర బ్యాంక్‌.. చివరికి.. నిత్యవసర వస్తువుల దిగుమతిని సైతం తగ్గించాలంటూ ఒత్తిడి తెస్తోంది. ఇలాంటి సమయంలో కూడా పాకిస్థాన్‌ దుబారా ఖర్చులు పెడుతున్నట్లు ఒక మీడియా వెలుగులోకి తెచ్చింది. లగ్జరీ కార్లు, అధునాతన విద్యుత్‌ వాహనాలు, వాటి విడి భాగాల దిగుమతికి 259 బిలియన్‌ రూపాయలు వెచ్చించిందని పేర్కొంది.

ఫొటోలపై తగ్గిన ఫోకస్‌

ఇన్‌స్టాగ్రామ్‌.. ఫొటో పోస్టింగ్‌లకు ఫేమస్‌. అందుకే ఫొటోగ్రాఫర్లు ఎక్కువ శాతం తమ ట్యాలెంట్‌ని ప్రదర్శించుకునేందుకు ఈ సామాజిక మాద్యమాన్నే వేదికగా మలచుకునేవారు. కానీ.. ఇప్పుడు వాళ్లల్లో ఆ విశ్వాసం సన్నగిల్లుతోంది. దీనికి కారణం ఇన్‌స్టాగ్రామ్‌లో ఈమధ్య వీడియోలకి మరియు రీల్స్‌కి అధిక ప్రాధాన్యత ఇస్తుండటం. ఈ విషయాన్ని సాక్షాత్తూ ఆ సంస్థ అధిపతి ఆడమ్‌ మొస్సెరి అంగీకరించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో గతేడాది వీడియోలకి, రీల్స్‌కి పెద్ద పీట వెయ్యటం వల్ల ట్రెడిషనల్‌ ఫొటో పోస్టింగులు పెట్టేవారు తమకు ప్రిఫరెన్స్‌ తగ్గిందనే భావనకు లోనయ్యారని వీక్లీ క్వచ్చన్‌ అండ్‌ ఆన్సర్‌ ప్రోగ్రామ్‌లో ఒప్పుకున్నారు.