Today (22-02-23) Business Headlines:
అదానీపై వికీపీడియా సైతం
ఇప్పటికే హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ సెగ నుంచి పూర్తిగా బయటపడని గౌతమ్ అదానీ గ్రూప్‌పై తాజాగా వికీపీడియా సైతం ఆరోపణలు గుప్పించింది. గౌతమ్ అదానీ, ఆయన ఫ్యామిలీ తమ గ్రూపు కంపెనీలకు అనుకూలంగా వ్యాసాలు రాయించుకున్నారని తప్పుపట్టింది. సంస్థలోని ఉద్యోగులను ఈ మేరకు వాడుకున్నట్లు తెలిపింది. వికీపీడియాలో ఏదైనా పేజీని ఎవరైనా మార్చే అవకాశం ఉండటంతో ఈ వెసులుబాటును వాడుకుందని పేర్కొంది. పెయిడ్ ఎడిటర్లతో ఇలా పాజిటివ్‌గా రాయించుకోవటం అనేది గడచిన పదేళ్లుగా సాగుతోందని వికీపీడియా వెల్లడించింది. ఈ ఆరోపణలపై అదానీ గ్రూపు అధికార ప్రతినిధి స్పందించలేదు.
డాక్టర్ రెడ్డీస్‌కి ప్రోత్సాహకం
మన దేశం ప్రస్తుతం ఖరీదైన మందుల కోసం విదేశీలపై ఆధారపడుతోంది. ఆయా దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. దీంతో ఈ విధానానికి స్వస్తి చెప్పాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఆ మందులను స్థానికంగానే తయారుచేసుకోవాలని సంకల్పించింది. మందులతోపాటు ఇండియాలో వైద్య పరికరాల ఉత్పత్తినీ ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఈ మేరకు నాలుగు సంస్థలను ఎంపిక చేసింది. ఉత్పాదక అనుసంధాన ప్రోత్సాహకం.. PLI అనే పథకం కింద 166 కోట్ల రూపాయల రాయితీ కల్పించింది. ఈ కంపెనీల లిస్టులో డాక్టర్ రెడ్డీస్, బయోకాన్, STRIDES PHARMA, ప్రీమియర్ మెడికల్ కార్పొరేషన్ ఉన్నాయి.
70 బీమా సంస్థలు సరిపోవు
140 కోట్లుగా ఉన్న భారతదేశ జనాభాకి ఇప్పుడున్న 70 ఇన్సూరెన్స్ కంపెనీలు సరిపోవని IRDA చైర్మన్ దేబాశిష్ పాండా అభిప్రాయపడ్డారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి.. అంటే.. 2047 కల్లా దేశంలోని ప్రతి వ్యక్తినీ బీమా పరిధిలోకి తీసుకురావాలంటే మరిన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు అవసరమని చెప్పారు. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తున్న ఇండియాలో అందరికీ ఒకే విధమైన పాలసీలు సరిపోవని అన్నారు. సంపన్నుల లక్ష్యాలకు తగ్గట్లుగా మరియు పేదలకు భరోసా కల్పించేలా ప్రత్యేకమైన పాలసీలను రూపొందించాలని సూచించారు.
తొలి ఫలితాలకి 15 రోజులు
స్టాక్ మార్కెట్‌లో కొత్తగా రిజిస్టరైన కంపెనీలు తొలిసారి ఆర్థిక ఫలితాలను వెల్లడించటానికి.. పేరు నమోదైన రోజు నుంచి కనీసం 15 రోజుల టైమైనా ఇవ్వాలని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా.. సెబీ.. ప్రతిపాదించింది. ఈ సంస్థలు రూల్స్ ప్రకారం ఫలితాలను సమర్పించటంలో కొన్ని ఛాలెంజ్‌లు ఎదురవుతున్నాయి. దీంతో కాస్త సడలింపు కావాలంటూ పరిశ్రమ వర్గాలు విజ్ఞప్తి చేశాయి. ఈ అభ్యర్థనను సెబీ పరిగణనలోకి తీసుకొని తాజా ప్రతిపాదన చేసింది. ప్రస్తుత నిబంధనల ప్రతి 3 నెలలు ముగిశాక 45 రోజుల్లోపు ఫలితాలను ప్రకటించాలి. లాస్ట్ క్వార్టర్ మరియు వార్షిక ఫలితాలకు ఈ గడువు 60 రోజులు.
5 వరకు ట్రేడింగ్ సమయం
బాంబే మరియు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌ల్లో ప్రస్తుతం ఫ్యూచర్ అండ్ ఆప్షన్ సెగ్మెంట్ ట్రేడింగ్ ఉదయం తొమ్మిదింబావు నుంచి మధ్యాహ్నం మూడున్నర వరకు జరుగుతున్న సంగతి తెలిసిందే. మొత్తం 6 గంటల 15 నిమిషాల పాటు జరుగుతున్న ఈ ట్రేడింగ్ సమయాన్ని మరో గంటన్నర పెంచి సాయంత్రం 5 వరకు పొడిగించాలని ఎన్‌ఎస్‌ఈ అనుకుంటోంది. ఈ మేరకు సంప్రదింపులను సైతం మొదలుపెట్టింది. ట్రేడింగ్ సమయం పెంపునకు సెబీ 14 ఏళ్ల కిందటే అనుమతించింది. కానీ.. ఎన్‌ఎస్‌ఈ ముందుకురాలేకపోయింది. ఇప్పుడు ప్రపంచ దేశాల మధ్య వాణిజ్య మరియు ఆర్థిక అనుసంధానం పెరుగుతుండటంతో పునరాలోచనలో పడింది.
వేదాంత డీల్‌కి కేంద్రం బ్రేక్
వేదాంతా గ్రూప్‌నకు కేంద్ర ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. ఆ సంస్థ తన గ్లోబల్ జింక్ బిజినెస్‌ని హిందుస్థాన్ జింక్ సంస్థకు అమ్మాలనుకున్న ప్రయత్నం ఫలించలేదు. తనకు ఆఫ్రికాలో ఉన్న ఆస్తులను హిందుస్థాన్‌కి విక్రయించాలని వేదాంత అనుకోగా దాన్ని ఆపేందుకు చట్టపరంగా ముందుకు వెళతామని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఆఫ్రిక బిజినెస్ వ్యాల్యూని వేదాంతా 2 పాయింట్ తొమ్మిది ఎనిమిది బిలియన్ డాలర్లుగా లెక్కించటం వల్లే సర్కారు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు గనుల మంత్రిత్వ శాఖ హిందుస్థాన్ జింక్ సంస్థకు లెటర్ పంపింది. ఈ లేఖను బోర్డు ముందుంచుతామని హింస్థాన్ సంస్థ ఎక్స్ఛేంజ్‌లకు సమాచారం ఇచ్చింది.