NTV Telugu Site icon

Today (20-01-23) Business Headlines: డబ్బున్నోళ్ల కోసమే ఈ డెబిట్‌ కార్డ్‌. మరిన్ని వార్తలు.

Today (20 01 23) Business Headlines

Today (20 01 23) Business Headlines

Today (20-01-23) Business Headlines:

మైక్రోసాఫ్ట్‌ @ తెలంగాణ

తెలంగాణ రాష్ట్రంలో మరో 3 డేటా కేంద్రాలను ఏర్పాటుచేసేందుకు మైక్రోసాఫ్ట్‌ సంస్థ ముందుకొచ్చింది. ఈ మేరకు 16 వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది. ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్‌ ఆసియా ప్రెసిడెంట్‌ అహ్మద్‌ మజహరి వెల్లడించారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సు జరుగుతున్న సందర్భంగా ఆయన తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు మరియు ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ని కలిసి తమ నిర్ణయాన్ని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్‌ ఇప్పటికే 3 డేటా కేంద్రాలను ప్రకటించింది. వాటి ఏర్పాటుకు కూడా 16 వేల కోట్లు వెచ్చిస్తామని గతంలోనే తెలిపింది. కొత్తగా రానున్నవి వాటికి అదనం.

‘ఫోన్‌పే’ విలువ రెట్టింపు

2020వ సంవత్సరం డిసెంబర్‌ నెలలో 550 కోట్ల డాలర్ల మార్కెట్‌ విలువ కలిగిన ఫోన్‌పే యాప్‌ వ్యాల్యూ ఇప్పుడు ఏకంగా 12 వందల కోట్ల డాలర్లకు చేరింది. రెండేళ్లలోనే రెట్టింపునకు పైగా విలువ పెరగటం విశేషం. ప్రస్తుతం ఫోన్‌పే మార్కెట్‌ విలువ రూపాయల్లో చెప్పాలంటే.. 97 వేల 800 కోట్లు. ఈ వ్యాల్యూ ఆధారంగానే లేటెస్ట్‌గా 35 కోట్ల డాలర్ల ఫండ్‌రైజ్‌ చేసింది. మొత్తం 100 కోట్ల డాలర్ల నిధులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ప్రైవేట్‌ ఈక్విటీ కంపెనీ జనరల్‌ అట్లాంటిక్‌తోపాటు మార్క్‌ గ్లోబల్‌ అనే డొమెస్టిక్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ సంస్థ నుంచి ఫండ్‌రైజ్‌ చేస్తోంది.

‘ఎస్ ప్రైవేట్’ డెబిట్ కార్డ్

డబ్బున్నోళ్ల కోసం ఎస్‌ బ్యాంక్‌ స్పెషల్‌గా ఒక ఏటీఎం కార్డును తీసుకొచ్చింది. ఈ కార్డును ‘ఎస్‌ ప్రైవేట్‌’ డెబిట్‌ కార్డు అంటారు. మాస్టర్‌ కార్డ్‌ అనే సంస్థతో కలిసి దీనికి రూపకల్పన చేసింది. పలు ప్రత్యేక సదుపాయాలు కలిగిన ఈ కార్డు బిజినెస్‌మ్యాన్‌లకు, ప్రొఫెషనల్స్‌కు చాలా ఉపయుక్తంగా ఉంటుందని ఎస్‌ బ్యాంక్‌ రిటైల్‌ బ్యాంకింగ్‌ విభాగం అధిపతి రాజన్‌ పెంటల్‌ అన్నారు. ఇది ఆసియా పసిఫిక్‌ రీజియన్‌లో తొలిసారిగా అందుబాటులోకి వచ్చిన అత్యత్తమ అంతర్జాతీయ డెబిట్‌ కార్డని మాస్టర్‌ కార్డ్‌ సౌత్‌ ఏసియా ప్రెసిడెంట్‌ గౌతమ్‌ అగర్వాల్‌ అభివర్ణించారు.

ఫ్యామిలీ బిజినెస్ సదస్సు

హైదరాబాద్‌ మరో విశేష కార్యక్రమానికి వేదిక కానుంది. నగరంలోని ప్రతిష్టాత్మక సంస్థ ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో ఫిబ్రవరి 4, 5 తేదీల్లో కుటుంబ వ్యాపార సదస్సు జరగనుంది. ఈ మేరకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ISBలోని థామస్‌ స్మిథేని సెంటర్‌ ఫర్‌ ఫ్యామిలీ ఎంటర్‌ప్రైజ్‌ ఈ సదస్సును నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న వివిధ కుటుంబ వ్యాపారాలకు సంబంధించిన పలు అంశాలను ఈ సమావేశంలో చర్చించనున్నారు. 30 ఫ్యామిలీలకు చెందిన బిజినెస్‌ కరస్పాండెంట్లు తమ అనుభవాలను పంచుకుంటారు. మొత్తమ్మీద 350 మందికి పైగా ప్రతినిధులు ఈ మీటింగ్‌లో పాల్గొంటారని ఆశిస్తున్నారు.

2వ స్థానంలో అంబానీ

బ్రాండ్‌ గార్డియన్‌షిప్‌ ఇండెక్స్‌-2023 విడుదలైంది. బ్రాండ్‌ ఫైనాన్స్‌ అనే సంస్థ రూపొందించిన ఈ సూచీలో రిలయెన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ ఇంటర్నేషనల్‌ లెవల్‌లో రెండో ర్యాంక్‌ సాధించారు. ఇండియా రేంజ్‌లో నంబర్‌ వన్‌గా నిలిచారు. అమెరికాలోని ఎన్విదియా అనే ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ కంపెనీ CEO జెన్సెన్ హాంగ్.. వరల్డ్‌ వైడ్‌గా ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నారు. మైక్రోసాఫ్ట్‌ అధిపతి సత్య నాదెళ్ల గతేడాది అగ్రస్థానం దక్కించుకోగా ఈసారి 3వ స్థానానికి పరిమితమయ్యారు. గూగుల్‌ CEO సుందర్‌ పిచాయ్‌ కన్నా కూడా ముఖేశ్‌ అంబానీ ముందువరుసలో ఉండటం చెప్పుకోదగ్గ విషయం. ఆనంద్‌ మహింద్రా 23వ ర్యాంక్‌ సొంతం చేసుకున్నారు.

హెరిటేజ్ కొత్త ప్రొడక్ట్స్

హెరిటేజ్‌ సంస్థ తాజాగా రెండు ప్రొడక్టులను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. అందులో ఒకటి.. తక్షణం ఎనర్జీనిచ్చే పానీయం కాగా మరొకటి.. పెరుగుకు సంబంధించింది. ఇన్‌స్టెంట్‌ ఎనర్జీ డ్రింక్‌ పేరు గ్లూకోశక్తి. ఈ పానీయంలో సోడియం, పొటాషియం, ఫాస్ఫరస్‌, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి. అందువల్ల ఈ డ్రింక్‌ తాగిన వెంటనే శక్తి వస్తుందని హెరిటేజ్‌ ఫుడ్స్‌ లిమిటెడ్‌ తెలిపింది. ఈ కంపెనీ రిలీజ్‌ చేసిన మరో ఉత్పత్తి క్రీమీలీషియస్‌ పెరుగు. ఇది మార్కెట్‌లో దొరికే ఇతర బ్రాండ్ల పెరుగు కన్నా ఎక్కువ క్వాలిటీ ఉంటుందని పేర్కొంది. ఈ 2 ప్రొడక్టులు ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుల్లోని అన్ని షాపుల్లో లభిస్తాయని తెలిపింది.