Today (11-02-23) Business Headlines:
బెల్జియం, తెలంగాణ ఒప్పందం
లైఫ్ సైన్సెస్ రంగంలో బెల్జియంకి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కుదిరింది. బెల్జియం దేశంలోని ఫ్లాండర్స్ అనే ప్రాంతంలో సుమారు 350 లైఫ్ సైన్సెస్ కంపెనీలు ఉన్నాయి. బయోఏషియా-2023కి ఫ్లాండర్స్ ఇంటర్నేషనల్ రీజనల్ పార్ట్నర్. ఈ నేపథ్యంలో ఫ్లాండర్స్ ఇన్వెస్ట్’మెంట్ అండ్ ట్రేడ్’తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేతులు కలిపింది. తద్వారా లైఫ్ సైన్సెస్ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకోనుంది. టీకాలు, MRNA టెక్నాలజీ ప్లాట్’ఫామ్స్, ఇమ్యునోథెరపీ, క్లస్టర్ టు క్లస్టర్ సహకారం తదితర అంశాల్లో కలిసి పనిచేయనున్నాయి.
దేశంలో లిథియం నిల్వల గుర్తింపు
బ్యాటరీల తయారీలో కీలకమైన లిథియం ఖనిజ నిక్షేపాలను మన దేశంలో తొలిసారిగా గుర్తించారు. జమ్మూకాశ్మీర్’లోని రియాసి జిల్లాలో 59 లక్షల టన్నుల నిల్వలు ఉన్నట్లు నిర్ధారించారు. లిథియంకి ప్రపంచ దేశాల్లో భారీ గిరాకీ ఉన్న నేపథ్యంలో ఈ నిక్షేపాలు వెలుగు చూడటం భారత దేశానికి శుభపరిణామమని చెప్పొచ్చు. దేశంగా వెలికితీసే అవకాశం ఉండటంతో ఇక దిగుమతులపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఫలితంగా ఆర్థిక భారం తగ్గుతుంది. విద్యుత్ వాహనాల తయారీ రంగం ఊపందుకుంటుంది.
తగ్గిన దేశ పారిశ్రామిక ఉత్పత్తి
డిసెంబర్ నెలలో దేశ పారిశ్రామిక ఉత్పత్తి 3 శాతం పడిపోయింది. నవంబర్’లో 7.3 శాతంగా నమోదు కాగా డిసెంబర్’కి వచ్చేసరికి 4 పాయింట్ 3 శాతంతో సరిపెట్టుకుంది. గనుల తవ్వకాలు, విద్యుత్, ఉత్పాదక వస్తువులు తదితర సెక్టార్లలో పరిస్థితులు మెరుగుపడినప్పటికీ తయారీ రంగం కుంటుపడటమే దీనికి ప్రధాన కారణం. అయితే.. ఇది 2021 డిసెంబర్’తో పోల్చితే ఎక్కువే కావటం గమనించాల్సిన విషయం. 2021 డిసెంబర్’లో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ.. IIP.. కేవలం ఒక శాతంగానే నమోదైంది.
కేంద్రానికి, సెబీకి సుప్రీం ఆదేశం
హిండెన్’బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ రిలీజ్ అనంతరం గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల పతనం వల్ల ఇన్వెస్టర్లు 10 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయారనే ఆందోళనలపై సుప్రీంకోర్టు స్పందించింది. పెట్టుబడిదారుల ప్రయోజనాల పరిరక్షణకు ఏం చేస్తారో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని మరియు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాని ప్రశ్నించింది. ముందు ముందు ఇలాంటివి జరక్కుండా చూడాలని సూచించింది. మార్కెట్ రెగ్యులేషన్ కోసం పటిష్టమైన వ్యవస్థ ఉండాలని, నిపుణుల కమిటీ ఏర్పాటును పరిశీలించాలని పేర్కొంది. ఈ మేరకు సోమవారం లోగా రిపోర్టు సమర్పించాలని ఆదేశించింది.
విదేశీ మారక నిల్వలు మళ్లీ డౌన్
ఇండియా విదేశీ మారక నిల్వలు మరోసారి డౌన్ అయ్యాయి. ఫారెక్స్ రిజర్వ్స్ తగ్గిపోవటం మూడు వారాల తర్వాత ఇదే మొదటిసారి. ఈ నెల 3వ తేదీతో ముగిసిన వారాంతంతో పోల్చితే 149 కోట్ల డాలర్లకు పైగా తగ్గిపోయాయి. ఫలితంగా.. మొత్తం నిల్వలు 57 వేల 526 కోట్ల డాలర్లకు దిగొచ్చాయి. ఈ వివరాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. డాలరుతో పోల్చితే రూపాయి విలువ సున్నా పాయింట్ 4 శాతం తగ్గింది. మారకం విలువ 81 రూపాయల 84 పైసలుగా నమోదైంది. డాలర్ సేల్స్ పెరగటం వల్లే విదేశీ మారక నిల్వలు తగ్గాయి.
184 దేశాల్లో టాప్-5లో ఇండియా
గ్లోబల్ క్వాలిటీ ఇన్’ఫ్రాస్ట్రక్చర్ ఇండెక్స్-2021 నివేదిక ఇటీవల విడుదలైంది. 184 దేశాలతో రూపొందించిన ఈ రిపోర్టులో ఇండియా 5వ స్థానంలో నిలిచింది. మౌలిక సదుపాయాల నాణ్యత ఆధారంగా ఈ నివేదికను తయారుచేశారు. క్వాలిటీ ఆఫ్ ఇన్’ఫ్రాస్ట్రక్చర్.. QI.. విషయంలో ఇండియా మొత్తం వ్యవస్థ 10వ స్థానంలో కొనసాగుతోంది. అక్రెడిటేషన్ సిస్టమ్స్’లో జర్మనీ టాప్’లో నిలిచింది. 2022 డిసెంబర్’లో విడుదలైన ఈ రిపోర్టులో ఇండియా టాప్-5లో నిలవటం గర్వకారణమని క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా హర్షం వ్యక్తం చేసింది.
