NTV Telugu Site icon

Today (09-01-23) Business Headlines: 15 దేశాలు.. 800 సంస్థలు. మరిన్ని వార్తలు

Today (09 01 23) Business Headlines

Today (09 01 23) Business Headlines

Today (09-01-23) Business Headlines:

‘పేటీఎం’కి సురిందర్‌ చావ్లా

పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అండ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా సురిందర్‌ చావ్లా నియమితులయ్యారు. ఈ నియామకాన్ని రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా కూడా ఆమోదించింది. సురిందర్‌ చావ్లా గతంలో ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ బ్రాంచ్‌ బ్యాంకింగ్‌ డిపార్ట్‌మెంట్‌ హెడ్‌గా చేశారు. పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ ఎండీ అండ్‌ సీఈఓగా మూడేళ్లపాటు ఉంటారు. ఈయన నియామకానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన ఆర్‌బీఐ.. కొత్త కస్టమర్లను చేర్చుకునే విషయంలో పేటీఎం బ్యాంక్‌పై విధించిన ఆంక్షలను మాత్రం సడలించలేదు.

15 దేశాలు.. 800 సంస్థలు..

జాతీయ రాజధాని ఢిల్లీలో ఈ నెల 13న ప్రారంభం కానున్న ఆటో ఎక్స్‌పో-2023లో 15 దేశాలకు చెందిన 800లకు పైగా సంస్థలు పాల్గొననున్నాయి. 18వ తేదీ వరకు జరగనున్న ఈ ప్రదర్శనలో 5 ఇంటర్నేషనల్‌ ఇన్నోవేషన్లతోపాటు 75 ప్రొడక్టులను లాంఛ్‌ చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. భారీ సంఖ్యలో కంపెనీలు పాలుపంచుకోనున్నాయని చెబుతున్న ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ప్రధాన సంస్థలైన మెర్సిడెస్‌-బెంజ్‌, బీఎండబ్ల్యూ మరియు ఆడి సంస్థలు హాజరయ్యే అవకాశాలు లేవని చెబుతున్నారు.

ఐడీబీఐ కొనుగోలు రేసులో..

ఐడీబీఐ బ్యాంక్‌లో మెజారిటీ షేరును సొంతం చేసుకునేందుకు పెద్ద పెద్ద సంస్థలు ముందుకొస్తున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పశ్చిమాసియాకు చెందిన బ్యాంకింగ్‌ జెయింట్‌ ‘ఎమిరేట్స్‌ NBD’తోపాటు ఫెయిర్‌ ఫాక్స్‌ గ్రూప్‌ మరియు CVC క్యాపిటల్‌ పార్ట్నర్స్‌ ఆసక్తి కనబరుస్తున్నట్లు పేర్కొన్నాయి. మొదటి రెండు సంస్థలు ఈ వారం ఆరంభంలో బిడ్లు దాఖలు చేస్తాయని చెబుతున్నారు. ఐడీబీఐ బ్యాంకులో ప్రభుత్వానికి మరియు ఎల్‌ఐసీకి ఉన్న 60 శాతానికి పైగా వాటాను అమ్మేందుకు దరఖాస్తులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

బీఎండబ్ల్యూ విద్యుత్‌ కారు

BMW విద్యుత్ కారు మన దేశ మార్కె్ట్‌లోకి విడుదలైంది. BMW I 7 X డ్రైవ్‌ 60 పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ లగ్జరీ కారు ధర 2 కోట్ల రూపాయలకు 5 లక్షలు మాత్రమే తక్కువ. 4 పాయింట్‌ 7 సెకన్లలో 100 కిలో మీటర్ల వేగాన్ని అందుకునే ఈ కారు గంటకు 240 కిలో మీటర్ల స్పీడ్‌తో ప్రయాణిస్తుంది. ఇందులో 101 పాయింట్‌ 7 కిలో వాట్ల కెపాసిటీ గల లిథియం అయాన్‌ రిసైక్లిబుల్‌ బ్యాటరీ ఉంటుంది. ఈ బ్యాటరీని ఒక్క సారి ఛార్జింగ్‌ చేస్తే 625 కిలో మీటర్ల వరకు వస్తుంది. ఈ లేటెస్ట్‌ మోడల్‌ BMW కార్ల డెలివరీ మార్చి నెల నుంచి ప్రారంభం కానుంది.

త్వరలో రూ.2 ట్రిలియన్లు క్రాస్

పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌ త్వరలోనే 2 ట్రిలియన్‌ రూపాయల వ్యాపార మైలురాయిని చేరుకునే అవకాశం ఉంది. ఈ విషయాన్ని బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ స్వరూప్‌ కుమార్‌ సాహా తెలిపారు. రుణాల్లో వృద్ధి నెలకొందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని 3వ త్రైమాసికంలో 17 శాతం క్రెడిట్‌ గ్రోత్‌తో 78 వేల 49 కోట్ల రూపాయలకు చేరుకుందని చెప్పారు. 2022 డిసెంబర్‌ 31 నాటికి బ్యాంక్‌ మొత్తం బిజినెస్‌ 12 పాయింట్‌ రెండు ఆరు శాతానికి.. అంటే.. 1 పాయింట్‌ ఎనిమిదీ ఏడు లక్షల కోట్లకు పెరిగినట్లు పేర్కొన్నారు.

రేట్లు పెరగనున్న సీలింగ్‌ ఫ్యాన్లు

సీలింగ్‌ ఫ్యాన్ల తయారీ ఖర్చులు 5 నుంచి 20 శాతం భారం కానుండటంతో రేట్లు కూడా అదే స్థాయిలో పెరగనున్నాయి. బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియెన్సీ రూపొందించిన కొత్త రూల్స్‌ ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చాయి. వీటికి అనుగుణంగా తయారీ కంపెనీలు సీలింగ్‌ ఫ్యాన్లకు ఒన్‌ టు ఫైవ్‌ స్టార్‌ రేటింగ్స్‌ ఇవ్వాలి. ఈ రేంజ్‌లో రేటింగ్స్‌ ఇవ్వాలంటే సరికొత్త సీలింగ్‌ ఫ్యాన్లను తయారుచేయాలి. తాజాగా దిగుమతి చేసుకున్న మోటర్లు మరియు విద్యుత్‌ పరికరాలు అమర్చాలి. ఈ నేపథ్యంలో మేకింగ్‌ కాస్ట్‌ తడిసి మోపెడవుతుంది. అందుకే సీలింగ్‌ ఫ్యాన్ల రేట్లు పెరగనున్నాయని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.