Site icon NTV Telugu

Today (01-02-23) Business Headlines: స్పాటిఫై ప్రపంచ రికార్డు. మరే సంస్థా సాధించని ఫీట్‌. మరిన్ని వార్తలు

Untitled (1)

Untitled (1)

Today (01-02-23) Business Headlines:

ఇండియాలో యాపిల్ విస్తరణ

యాపిల్‌ కంపెనీ ఎయిర్‌పాడ్స్‌ విడి భాగాల తయారీ ఇండియాలో ప్రారంభమైనట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీన్నిబట్టి ఈ అమెరికా టెక్నాలజీ జెయింట్‌.. భారత్‌దేశంలో ప్రొడక్షన్‌ను విస్తరిస్తోందని చెప్పొచ్చు. యాపిల్‌ కంపెనీకి కీలకమైన సప్లయర్‌గా వ్యవహరిస్తున్న జాబిల్‌ అనే సంస్థ ఎయిర్‌పాడ్స్‌ ఎన్‌క్లోజర్లను లేదా ప్లాస్టిక్‌ పరికరాలను చైనాకి మరియు వియత్నాంకి సరఫరా చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఆయా దేశాల్లో వైర్‌లెస్‌ ఇయర్‌ ఫోన్లను అసెంబుల్‌ చేస్తారనే సంగతి తెలిసిందే. చైనాలో కొవిడ్‌ ఆంక్షల నేపథ్యంలో యాపిల్‌ సంస్థ ప్రొడక్షన్‌ కార్యకలాపాల కోసం ఆ దేశంపై ఆధారపడటం తగ్గించింది.

మనం 5 లక్షల కోట్ల డాలర్లకు

భారత ఆర్థిక వ్యవస్థ 6 పాయింట్‌ 5 శాతం నుంచి 7 శాతం వరకు వృద్ధి రేటుతో కొనసాగి 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి 5 లక్షల కోట్ల డాలర్లకు చేరనుందని ముఖ్య ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్‌ అన్నారు. గడచిన 3 దశాబ్దాల్లో స్థూల దేశీయోత్పత్తి డాలర్ల రూపంలో యావరేజ్‌గా 9 శాతం యాన్యువల్‌ గ్రోత్‌ సాధించిందని చెప్పారు. రూపాయి విలువ పతనమైన సమయంలోనూ ఈ స్థాయిలో వృద్ధిని నమోదు చేయటం విశేషమని తెలిపారు. రూపాయి విలువ బలపడినట్లయితే 2030 నాటికి ఇండియన్‌ ఎకానమీ రేంజ్‌ 7 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంటుందని అనంత నాగేశ్వరన్‌ అంచనా వేశారు.

జీఎస్టీ రూ.1.55 లక్షల కోట్లు

2023 జనవరి నెలకు సంబంధించి వస్తు సేవా పన్ను లక్షా 55 వేల 922 కోట్ల రూపాయలు వసూలైంది. ఇది.. నిన్న మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉన్న సమాచారం. 2022 ఏప్రిల్‌ నెలలో లక్షా 68 కోట్ల రూపాయలు రాగా దాని తర్వాత ఇది రెండో అత్యధిక వసూలు. జనవరి నెల వసూళ్లలో CGST ద్వారా వచ్చినవి 28 వేల 963 కోట్ల రూపాయలు కాగా SGST ద్వారా వచ్చినవి 36 వేల 730 కోట్ల రూపాయలు. ఇక.. ఐజీఎస్‌టీ ద్వారా 79 వేల 599 కోట్ల రూపాయలు వసూలైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

స్పాటిఫై.. 205 మిలియన్లకు..

మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం స్పాటిఫై ప్రీమియం సబ్‌స్క్రైబర్ల సంఖ్య 205 మిలియన్‌లకు చేరింది. పెయిడ్‌ యూజర్ల సంఖ్య ఈ స్థాయిలో కలిగిన ప్రపంచంలోనే మొట్టమొదటి మ్యూజిక్‌ స్ట్రీమింగ్‌ కంపెనీగా స్పాటిఫై ఘనత సాధించింది. ప్రీమియం సబ్‌స్క్రైబర్ల సంఖ్య గతేడాదితో పోల్చితే 14 శాతం పెరిగిందని స్పాటిఫై తెలిపింది. మంత్లీ యాక్టివ్‌ యూజర్ల సంఖ్య 489 మిలియన్‌లకు చేరినట్లు ఆ సంస్థ Q4 2022 ఎర్నింగ్స్‌ రిపోర్ట్‌ వెల్లడించింది. మంత్లీ యాక్టివ్‌ యూజర్ల విషయంలో గతేడాది కన్నా 20 శాతం వృద్ధి సాధించినట్లు పేర్కొంది.

ఆస్ట్రేలియన్ రెగ్యులేటర్ రివ్యూ

అదానీ గ్రూపు సంస్థల విషయంలో హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ వెలువరించిన రిపోర్టుపై ఆస్ట్రేలియన్‌ కార్పొరేట్‌ రెగ్యులేటర్‌ సమీక్ష నిర్వహిస్తోంది. రివ్యూ అనంతరం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందా లేదా అనేది నిర్ణయిస్తామని అధికార ప్రతినిధి తెలిపారు. హిండెన్‌బర్గ్‌ రిపోర్టు ఆస్ట్రేలియాలోని అదానీ వ్యాపారాలపైనా ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో వాటిని ప్రస్తావిస్తూ అదానీ గ్రూపు వివరణ కూడా ఇచ్చింది. షార్ట్‌ సెల్లింగ్‌ సంస్థ అయిన హిండెన్‌బర్గ్‌ స్వలాభం కోసం మరియు తమ కీర్తిప్రతిష్టలకు భంగం కలిగించేందుకే అసత్యాలను ప్రచారం చేసినట్లు ఖండించింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియన్‌ కార్పొరేట్‌ రెగ్యులేటర్‌ ప్రకటన చేసింది.

పేపాల్‌లో 2 వేల మంది ఔట్‌

పేపాల్‌ హోల్డింగ్స్‌ సంస్థ 2 వేల మంది ఉద్యోగులను తొలగించనుంది. ఇటీవలి త్రైమాసికాల్లో తమ ఆర్థిక పరిస్థితులు ఏమాత్రం బాగలేవని, అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరణ ఇచ్చింది. ఖర్చులను తగ్గించుకోవటం ద్వారా వ్యూహాత్మక ప్రాధాన్యతలపై ఫోకస్‌ పెట్టనున్నామని పేపాల్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ డాన్‌ షుల్మాన్‌ పేర్కొన్నారు. ఉద్యోగులను తొలగించినంత మాత్రాన కంపెనీ అభివృద్ధి నిలిచిపోదని, ముందు ముందు తాము చేయాల్సింది చాలా ఉందని చెప్పారు. కరోనా నేపథ్యంలో పేపాల్‌ ప్లాట్‌ఫాంపై పేమెంట్ల సంఖ్య తగ్గిపోవటం వల్ల ఆ సంస్థ షేర్‌ వ్యాల్యూ కూడా పతనమైంది.

Exit mobile version