Municipal Elections 2026: మున్సిపల్ కార్యాలయం ముందు వైసీపీ అభ్యర్థి నిరసన.. నామినేషన్ వేసేందుకు అవకాశం ఇవ్వాలని సీఎంకు అభ్యర్థన!

Tirupati Ycp Mayor Candidate Protest

Tirupati Ycp Mayor Candidate Protest

Tirupati YCP Mayor Candidate Protest: తిరుపతి మున్సిపల్ కార్యాలయం వద్ద రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ మేయర్ అభ్యర్థి వాసు యాదవ్ తన నామినేషన్ దాఖలు చేసేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ తల్లితో కలిసి నిరసనకు దిగారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట రోడ్డుపై కూర్చొని ఆందోళన చేశారు. నామినేషన్ వేయడానికి తనకు అవకాశం ఇవ్వాలని అధికారులను కోరారు. నామినేషన్ వేసేందుకు తన కొడుక్కి అవకాశం ఇవ్వాలని సీఎం చంద్రబాబుకు వాసు యాదవ్ తల్లి అభ్యర్థన చేశారు. నేడు నామినేషన్ వేసేందుకు చివరి తేదీ అన్న విషయం తెలిసిందే. మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థులు నామినేషన్ వేయొచ్చు.

నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్లిన సమయంలో తనను ఇదివరకే అడ్డుకున్నారని వాసు యాదవ్ ఆరోపించారు. నిన్న కూడా మున్సిపల్ కార్యాలయం వద్దకు వెళ్లిన ఆయనను టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. ‘గతంలో మీరు మమ్మల్ని అడ్డుకున్నారు.. ఇప్పుడు మేము మిమ్మల్ని అడ్డుకున్నాం’ అంటూ టీడీపీ కార్యకర్తలు అన్నట్లు చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో వాసు యాదవ్ మరోసారి నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.

ఈ సందర్భంగా వాసు యాదవ్ తల్లి భావోద్వేగంగా స్పందించారు. తమ కుటుంబానికి మేయర్ పదవికి పోటీ చేసే అవకాశం వచ్చిందని, తన కుమారుడు నామినేషన్ వేయకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. తాము బీసీ వర్గానికి చెందినవారమని, యాదవులకు అవకాశం రావడంతో తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ‘మేము బీసీలం. మేయర్‌గా నా కొడుక్కి అవకాశం వచ్చింది. యాదవులకు అవకాశం వచ్చిందని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. నా కొడుకు నామినేషన్ వేయడానికి వస్తున్నాడు. ఎస్పీ గారు, కలెక్టర్ గారు.. మీదే బాధ్యత. సీఎం చంద్రబాబు గారు నా కొడుకు నామినేషన్ వేసే బాధ్యత మీదే. ఓ తల్లిగా మిమ్మల్ని కోరుతున్నా’ అంటూ ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనతో తిరుపతిలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ చుట్టూ రాజకీయ వాతావరణం వేడెక్కింది.