Tirupati Rural ZPTC Result 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా నవంబర్ 5న నిర్వహించిన పరిషత్ ఎన్నికల (ఎంపీటీసీ, జెడ్పీటీసీ) ఓట్ల లెక్కింపు నవంబర్ 7న జరిగింది. ఈ కౌంటింగ్‌లో చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని తిరుపతి రూరల్ జెడ్పీటీసీ స్థానంపై అత్యంత ఉత్కంఠ నెలకొంది. చివరి వరకు నువ్వా నేనా అన్నట్లుగా సాగిన పోరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి విజయం సాధించారు. దాంతో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబం సంబరాలు చేసుకుంది.
చెవిరెడ్డి భాస్కర్‌రె డ్డి కుమారుడైన హర్షిత్ రెడ్డి తన సమీప ప్రత్యర్థిపై 602 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ప్రతి రౌండ్‌లోనూ ఆధిక్యం మారుతూ, కౌంటింగ్ ప్రక్రియ ఆసక్తికరంగా సాగింది. చివరకు ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక అధికారులు హర్షిత్ రెడ్డి 602 ఓట్ల తేడాతో విజయం సాధించినట్లు ప్రకటించారు. లక్షన్నరకు పైగా ఓటర్లు ఉన్న ఈ జెడ్పీటీసీ పరిధిలో సుమారు 85 వేలకు పైగా ఓట్లు పోలయ్యాయి. పోలైన ఓట్ల లెక్కింపు చివరి వరకు ఉత్కంఠను రేకెత్తించడంతో అభ్యర్థులు, పార్టీల శ్రేణుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. చివరికి హర్షిత్ రెడ్డి విజయం ఖరారు కావడంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పరిషత్ ఎన్నికల్లో చాలా స్థానాల్లో టీడీపీ, జనసేన, బీజేపీతో కూడిన ఎన్డీయే కూటమి అభ్యర్థులు ఆధిక్యం ప్రదర్శించినప్పటికీ.. చంద్రగిరి నియోజకవర్గంలోని తిరుపతి రూరల్ జెడ్పీటీసీ స్థానంలో మాత్రం వైఎస్సార్‌సీపీ తన పట్టును నిలుపుకుంది. చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి విజయం ఈ ఎన్నికల్లో ప్రత్యేకంగా నిలిచింది. మరోవైపు అల్లూరి సీతారామరాజు జిల్లాలో మెజార్టీ జెడ్పీటీసీ స్థానాలను వైఎస్సార్‌సీపీ దక్కించుకుంది. 11 జెడ్పీటీసీ స్థానాలకు గాను 7 చోట్ల వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది. చింతపల్లి, పెదబయలు, అనంతగిరి, జీకే వీధి, డుంబ్రిగూడ, పాడేరు, హుకుంపేట జెడ్పీటీసీ స్థానాలను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది.

