Tirupati Gangamma Jathara: తిరుపతి గంగమ్మ జాతర చాటింపుతో నేటి నుంచి ప్రారంభమైంది. వారం రోజుల పాటు ఈ జాతర కొనసాగనుంది. జాతర నేపథ్యంలో గ్రామస్థులు ఊరును విడిచి వెళ్లరాదని చాటింపు వేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు రాత్రి పూట ఇక్కడ బస చేయకుండా వెళ్లిపోవాలి. జాతర ప్రారంభమైనందున అమ్మవారి అనుగ్రహం పొందేందుకు పూజలు నిర్వహించుకోవాలి.. అంటూ సంప్రదాయం ప్రకారం కైకాల వంశస్తులు తిరుపతి గంగజాతర మంగళవారం అర్ధరాత్రి తర్వాత చాటింపు వేశారు. భేరివీధిలో తొలి చాటింపు పూజ నిర్వహించిన అనంతరం నాటి నగర శివారు ప్రాంతాలైన నాలుగు కాళ్ల మండపం, హెడ్‌పోస్టాఫీస్, కృష్ణాపురం ఠాణా, పాత మెటర్నిటీ ఆసుపత్రి సర్కిల్ ప్రాంతాల్లో అష్టదిగ్బంధనం చేసి చాటింపుతో జాతరకు శ్రీకారం చుట్టారు. ఆ చాటింపుతో తిరుపతి శ్రీతాతయ్యగుంట చిన్నగంగమ్మ (తిరుపతి గ్రామదేవత) జాతర అత్యంత వేడుకగా ఆరంభమైంది. తిరుపతి గ్రామదేవత శ్రీతాతయ్యగుంట గంగమ్మ జాతర బుధవారం నుంచి ఈనెల 16వ తేదీ వరకు ఘనంగా జరగనుంది.
ఆంధ్రప్రదేశ్ లో వివిధ ప్రాంతాల్లో జరిగే జాతర్లలో తిరుపతి గంగమ్మ జాతర చెప్పుకోదగ్గది. తెలంగాణలో బోనాలు, బతుకమ్మ పండుగలు సమ్మక్కసారక్క జాతర్ల లాగానే తిరుపతిలో నిర్వహించే గంగమ్మ జాతర సుప్రసిద్ధమైంది.ఒకనాటి తిరుపతి, పరిసర ప్రాంతాల ప్రజల ఆచార వ్యవహారాలనూ వారి జీవన విధానాలనూ అచ్చంగా ప్రతిబింబించే అపురూపమైన జాతర ఇది. అన్ని గ్రామాలకూ ఉన్నట్టే తిరుపతి గ్రామదేవత శ్రీ తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ. గంగమ్మకు ఎనిమిది రోజులపాటు అత్యంత వైభవంగా జరిగే ఈ జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తారు. జాతర ప్రారంభ సన్నాహకాల్లో భాగంగా మంగళవారం ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. ఇందులో భాగంగా ఉదయం 8 గంటలకు ఆలయ ఆవరణలోనున్న అమ్మవారి విశ్వరూప కొడిస్తంభానికి అర్చకులు అభిషేకం చేసిన అనంతరం కొడిస్తంభానికి ఒడిబాలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్లు ముద్రనారాయణ, భూమన అభినయరెడ్డి హాజరయ్యారు.
Read Also: AP Polycet: రాష్ట్ర వ్యాప్తంగా నేడు పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష
అమ్మవారిని దర్శించుకొని ఒడిబాలును నెత్తినపెట్టుకొని మంగళవాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణతో కొడిస్తంభం వద్దకు చేరుకొని పూజలు చేసి ఆ ఒడిబాలు సమర్పించారు. ఆలయంలో అమ్మవారి మూలవిరాట్టుకు అభిషేకం చేసి ప్రత్యేక అలంకరణలో కొలువు తీర్చారు. పెద్దసంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చి పొంగళ్లు నైవేద్యాన్ని సమర్పించారు. తిరుపతి గంగమ్మ జాతర ఉత్సవాల్లో భాగంగా.. తొలిరోజు బుధవారం బైరాగి వేషంతో జాతర ఆరంభమవుతుంది. బైరాగి వేషాలు వేసిన వారు గుంపులు గుంపులుగా బయలుదేరి మొదట వేషాలమ్మను, తర్వాత శ్రీతాళ్లపాక పెద్దగంగమ్మను దర్శించుకొని తర్వాత శ్రీతాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి చేరుకుంటారు. కేరింతలు కొడుతూ ఆలయ ప్రదక్షిణ చేసి అమ్మవారి పాదాల వద్ద ప్రణమిల్లి మొక్కులు తీర్చుకుంటారు.