Tirupati: శేషాచలం అడవుల్లో రెండుగా విడిపోయిన ఏనుగుల గుంపు.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!

Seshachalam Forest Elephants

Seshachalam Forest Elephants

Tirupati Elephant Alert: తిరుపతి శేషాచలం అటవీ ప్రాంతంలో ఏనుగుల కదలికలు కలకలం రేపుతున్నాయి. ఏనుగుల మంద రెండుగా విడిపోవడంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఓ గుంపు చంద్రగిరి వైపు కదులుతుండగా.. మరో గుంపు తిరుమల వైపు పయనిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. భాకరాపేట, దిగువూరు వైపు నుంచి సుమారు 13 ఏనుగులతో కూడిన మంద చంద్రగిరి దిశగా కదులుతోంది. మరో 22 ఏనుగులు అటవీ మార్గంలో తిరుమల వైపు వెళ్తున్నాయి. దీంతో ఏనుగుల సంచార మార్గాలకు సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ఏనుగుల కదలికలను అటవీ శాఖ అధికారులు అత్యాధునిక డ్రోన్ కెమెరాల సహాయంతో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఏనుగుల గుంపులు ఏ ప్రాంతంలో ఉన్నాయి?.. వాటి కదలికలు ఏ దిశగా సాగుతున్నాయి?.. అనే అంశాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ అవసరమైన చర్యలకు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా భీమవరం, చిన్న రామాపురం, కొండ్రెడ్డి కండ్రిగ గ్రామాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ హెచ్చరించింది. అనవసరంగా అటవీ ప్రాంతాల్లోకి వెళ్లవద్దని, ఒంటరిగా అడవి మార్గాల్లో సంచరించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

ఏనుగుల సంచారం కనిపించినప్పుడు వాటికి దగ్గరగా వెళ్లడం, వాటిని తరిమే ప్రయత్నం చేయడం లేదా ఫొటోలు, వీడియోల కోసం సమీపించడం వంటి చర్యలకు పాల్పడవద్దని అధికారులు స్పష్టం చేశారు. ఏనుగులు కనిపిస్తే వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరారు. ప్రస్తుతం డ్రోన్ల ద్వారా ఏనుగుల గుంపుల కదలికలను నిశితంగా పరిశీలిస్తున్న అధికారులు.. వాటి సంచారం వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు. గ్రామాల ప్రజలు అటవీ శాఖ సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.