NTV Telugu Site icon

Tina Dabi: పాక్‌ హిందూ శరణార్థుల నివాసాలు బుల్డోజర్‌తో కూల్చివేత.. మరోసారి వార్తల్లో టీనా దాబి

Tina Dabi

Tina Dabi

Tina Dabi: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ పరీక్షల్లో 2015 టాపర్‌గా నిలిచి సెకండ్ ర్యాంకర్‌ను వివాహమాడి.. రెండేళ్లకే విడాకులు తీసుకున్న ఐఏఎస్ అధికారి టీనా దాబి.. గతేడాది మళ్లీ పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం జైసల్మేర్ జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తోన్న టీనా దాబి.. వివాదాస్పద నిర్ణయంతో మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఐఏఎస్ టీనా దాబీ ఆదేశాల మేరకు పాకిస్థాన్ నుంచి వలస వచ్చిన హిందువుల తాత్కాలిక నివాసాలను బుల్డోజర్‌తో అధికారులు కూల్చివేశారు. జైసల్మేర్ జిల్లా కేంద్రానికి 4 కిలోమీటర్ల దూరంలోని అమర్‌సాగర్ గ్రామంలోని వీరి గుడారాలను కూల్చివేయడంతో వలసదారులు ఆందోళనకు దిగారు. తమ ఇళ్లను తగులబెట్టారని, అధికారుల చర్యలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న మహిళను బలవంతంగా ఈడ్చుకెళ్లారంటూ వారు ఆరోపణలు చేశారు. అయితే, తమకు వేరే చోట పునరావాసం కల్పించే వరకు తమ ధర్నాను విరమించేది లేదని వలసదారులు ఆందోళనను కొనసాగించారు. ఇదిలా ఉండగా.. తన నిర్ణయాన్ని టీనా దాబీ సమర్ధించుకున్నారు. అమర్‌సాగర్ సర్పంచ్, స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ప్రభుత్వ స్థలం నుంచి పాక్ హిందూ వలసవాదులు ఖాళీ చేయాల్సిందేనని స్పష్టం చేశారు.

Read Also: Honeymoon: హనీమూన్‌లో అశ్లీల వీడియోలు తీసి బెదిరింపు.. రూ.10 లక్షలిస్తేనే శోభనం

పాక్‌ నుంచి వచ్చిన వలసదారులు సర్కారుకు చెందిన భూమిని ఆక్రమించారని టీనాదాబీ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పట్టణ అభివృద్ధి ట్రస్ట్ భూమిని ఖాళీ చేయమని శరణార్థులకు ముందస్తు నోటీసులు కూడా అందించామని, అయితే వారు స్పందించలేదని ఆమె పేర్కొన్నారు. ఇప్పటి వరకు 28 ఆక్రమణలు తొలగించారు. భారత పౌరసత్వం పొందని వలసదారుల పునరావాసానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి మార్గదర్శకాలను జారీ చేయలేదంటూ టీనా దాబి చెప్పారు. ఈ అంశంపై నెట్టింట తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాకిస్థాన్ నుంచి వచ్చిన శరణార్థ పేద దళిత హిందువుల పట్ల రాజస్థాన్ ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోంచిందని నెటిజన్లు మండిపడుతున్నారు.

Show comments