Tilak Verma Meets Telangana CM Revanth Reddy: ఆసియా కప్-2025 ఫైనల్ మ్యాచ్ లో పాక్‌పై భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంలో కీలకపాత్ర పోషించిన తిలక్ వర్మ తాజాగా సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా తిలక్ వర్మను రేవంత్ సత్కరించి అభినందించారు. తిలక్ సీఎంకి తన బ్యాట్‌ను బహూకరించాడు. ఈ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి, శాట్స్ ఛైర్మన్ శివసేనా రెడ్డి, శాట్స్ ఎండీ సోనిబాల దేవి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
READ MORE: Dangerous Stunts on Road: ఇవే తగ్గించుకుంటే మంచిది.. స్కూటీపై స్టంట్స్ చేస్తూ యువకుడి రచ్చ రచ్చ
ఇదిలా ఉండగా.. తిలక్ వర్మ ఈరోజు లింగంపల్లిలోని లేగల గ్రౌండ్‌కు వెళ్లారు. అక్కడ శిక్షణ పొందుతున్న ఆటగాళ్లతో సరదాగా ముచ్చటించారు. అనంతరం తిలక్ వర్మ మీడియాతో మాట్లాడుతూ.. జట్టు సభ్యులం అందరం కలిసి టీమిండియా గెలుపు కోసం కృషి చేశాం అని ఆసియా కప్ 2025 ఫైనల్ హీరో, తెలుగు ఆటగాడు తిలక్ వర్మ తెలిపాడు. ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై మన దేశాన్ని గెలిపించాలనే లక్ష్యంతోనే ఆడానని చెప్పాడు. ఆసియా కప్ ఫైనల్‌లో చాలా ఒత్తిడిలోనే తాను బ్యాటింగ్ చేశానన్నాడు. ఆసియా కప్ టోర్నీలో అందరం సమష్టిగా కష్టపడ్డాం అని తిలక్ వర్మ పేర్కొన్నాడు. ఫైనల్‌లో చివరి నిమిషం వరకు నరాలు తెగే ఉత్కంఠ కొనసాగిన విషయం తెలిసిందే. ఓటమి తీరాలకు వెళ్తున్న మ్యాచ్‌కు ఒంటరి పోరాటంతో తిలక్ గెలుపు బాటలు వేశాడు.
ఆసియా కప్ 2025 ఫైనల్‌లో తిలక్ వర్మ వీరోచిత పోరాటంతో తెలుగోడి సత్తా ప్రపంచానికి చాటి చెప్పాడు. 53 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులతో 69 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. హైఓల్టేజ్ మ్యాచ్‌లో చెలరేగిన తిలక్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. మనోడిపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. తిలక్ సోమవారం యూఏఈ నుంచి హైదరాబాద్ చేరుకున్నాడు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో అతడికి ప్రభుత్వ అధికారులు, ఫాన్స్ ఘన స్వాగతం పలికారు. ‘చాలా సంతోషంగా ఉంది. ఆసియా కప్ ఫైనల్‌లోని ఇన్నింగ్స్ ఎప్పటికీ గుర్తుంటుంది. ఫైనల్‌లో అందరం సమష్టిగా కష్టపడ్డాం. నేను చాలా ఒత్తిడిలోనే బ్యాటింగ్ చేశా. దేశాన్ని గెలిపించాలన్న లక్ష్యంతో ఆడా. పాకిస్థాన్ ప్లేయర్స్ చాలా ఒత్తిడికి గురిచేశారు, అయినా పట్టించుకోలేదు. మ్యాచ్ గెలిచి వారికి ధీటుగా బదులివ్వాలని అనుకున్నా. టోర్నీలో ప్రతి మ్యాచ్‌లో వ్యూహాలు మార్చుకుంటూ ముందుకువెళ్లాం. నా విజయంలో తల్లిదండ్రులు, కోచ్ దే కీలక పాత్ర. నా క్రికెట్ కెరీర్ కోసం చిన్నప్పటినుంచి ఎంతో కృషి చేశారు’ అని చెప్పాడు.
