Tilak Varma: టీమిండియా బ్యాటర్ తిలక్ వర్మ టీ20ల్లో మరో అరుదైన ఘనతను సాధించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో అద్భుత అర్ధ సెంచరీతో భారత్‌ను విజయతీరాలకు చేర్చిన తిలక్.. ఛేజింగ్‌లో అత్యధిక బ్యాటింగ్ సగటు కలిగిన భారత ఆటగాళ్ల జాబితాలో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని అధిగమించాడు. ప్రస్తుతం ఈ జాబితాలో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉండగా.. తిలక్ వర్మ రెండో స్థానానికి చేరుకున్నాడు.
గత కొన్ని మ్యాచ్‌లలో తిలక్ వర్మ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో జట్టులో అతడి స్థానంపై ప్రశ్నలు తలెత్తాయి. అయితే న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో 26 బంతుల్లో 51 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడి విమర్శలకు బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చాడు. ఒత్తిడిలో అద్భుతంగా ఆడుతూ తన ఛేజింగ్ సామర్థ్యాన్ని మరోసారి సత్తాచాటాడు. ఈ ఇన్నింగ్స్‌తో టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో ఛేజింగ్ సమయంలో తిలక్ వర్మ బ్యాటింగ్ సగటు 51.62కు చేరింది. కనీసం 500 పరుగులు చేసిన భారత బ్యాటర్లలో ఛేజింగ్‌లో 50కి పైగా సగటు కలిగిన రెండో ఆటగాడిగా తిలక్ నిలిచాడు. 2024 టీ20 ప్రపంచకప్ తర్వాత ఈ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లీ 67.1 సగటుతో అగ్రస్థానంలో ఇప్పటికీ కొనసాగుతున్నాడు.
ఇప్పటివరకు రెండో స్థానంలో ఉన్న మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని 47.71 సగటుతో మూడో స్థానానికి పడిపోయాడు. సూర్యకుమార్ యాదవ్ 40.46 సగటుతో నాలుగో స్థానంలో ఉండగా.. కేఎల్ రాహుల్ 38.95 సగటుతో ఐదో స్థానంలో ఉన్నాడు. టీ20 ఛేజింగ్‌లో అత్యధిక బ్యాటింగ్ సగటు (భారత బ్యాటర్లు, కనీసం 500 పరుగులు) కలిగిన వాళ్లు:
* విరాట్ కోహ్లీ – 67.10
* తిలక్ వర్మ – 51.62
* ఎంఎస్ ధోని – 47.71
* సూర్యకుమార్ యాదవ్ – 40.46
* కేఎల్ రాహుల్ – 38.95
మరోవైపు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వరుసగా తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన భారత్ 2-0 ఆధిక్యంలో ఉంది. మూడో టీ20 వెల్లింగ్టన్‌లో జరగనుంది. అక్కడి బలమైన గాలులు, వాతావరణ పరిస్థితులు భారత ఆటగాళ్లకు సవాల్‌గా మారుతున్నాయి. ప్రాక్టీస్ సమయంలో ఆటగాళ్ల క్యాప్‌లు గాలికి ఎగిరిపోతున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో కనిపించాయి. మూడో టీ20లోనూ విజయం సాధిస్తే భారత్ 3-0తో సిరీస్‌ను సొంతం చేసుకుంటుంది. మరోవైపు సిరీస్‌లో నిలవాలంటే న్యూజిలాండ్‌కు ఈ మ్యాచ్‌లో విజయం తప్పనిసరి. దీంతో వెల్లింగ్టన్ వేదికగా జరిగే మూడో టీ20పై అందరి చూపు ఉంది. నేడు వెల్లింగ్టన్ వేదికగా మూడో టీ20 జరగనుంది.

