Tiger Shroff Firing Incident: ముంబైలోని జుహూ ప్రాంతంలో బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై జరిగిన కాల్పుల ఘటన ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతోంది. ఆదివారం సాయంత్రం ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడి తిరిగి వస్తున్న టైగర్ ష్రాఫ్ కారును బైక్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు టార్గెట్ చేసి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో టైగర్ ష్రాఫ్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నప్పటికీ, ఆయన కుడి చేతికి గన్‌పౌడర్ తగిలి కాలిన గాయాలయ్యాయి. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగిన వెంటనే మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేరుగా టైగర్ ష్రాఫ్ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఈ ఘటన చాలా తీవ్రమైనదని, ముంబైలో మళ్లీ గ్యాంగ్ వార్లను పునరుద్ధరించాలని చూసే ఏ ఒక్కరినీ ఉపేక్షించేది లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని షిండే స్పష్టం చేశారు.
కాగా.. ఆదివారం సాయంత్రం టైగర్ ష్రాఫ్ ఫుట్‌బాల్ మ్యాచ్ ముగించుకుని తన బీఎండబ్ల్యూ కారులో వెళుతుండగా ఈ కాల్పుల ఘటన జరిగింది. దుండగులు ఆయన కారుపై ఏకంగా ఐదు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నటుడికి నేరుగా బుల్లెట్ గాయాలు కానప్పటికీ, ఆయన డ్రైవర్ ఫిర్దౌస్ అలాగే ఓ ఆటోరిక్షా డ్రైవర్ గాయపడ్డారు. టైగర్ ష్రాఫ్‌ను కలిసిన తర్వాత ఏక్‌నాథ్ షిండే మీడియాతో మాట్లాడుతూ.. కాల్పుల సమయంలో తుపాకి నుంచి వెలువడిన గన్‌పౌడర్ తగలడం వల్ల టైగర్ ష్రాఫ్ కుడి చేతికి కాలిన గాయాలయ్యాయని తెలిపారు. తమకు ఎవరితోనూ ఎలాంటి శత్రుత్వం గానీ, గొడవలు గానీ లేవని, ఈ ఘటనతో తన కుటుంబం, ముఖ్యంగా తన తల్లి తీవ్రంగా ఆందోళన చెందుతున్నట్లు టైగర్ ష్రాఫ్ కుటుంబ సభ్యులు తమతో చెప్పినట్లు షిండే వెల్లడించారు. ముంబై పోలీసులతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని నటుడి కుటుంబానికి ఆయన భరోసా ఇచ్చారు.
సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీల భద్రత కూడా ప్రభుత్వానికి ఎంతో ముఖ్యమని, ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు అత్యంత ప్రాధాన్యతాంశంగా తీసుకుంటారని ఉప ముఖ్యమంత్రి చెప్పారు. ముంబైలో ఎవరైనా బెదిరింపులకు పాల్పడినా, హూలిగానిజం చేసినా సహించేది లేదని హెచ్చరించారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కూడా ఈ ఘటనను చాలా సీరియస్‌గా తీసుకున్నారని తెలిపారు. సెలబ్రిటీలకు ఎవరైనా బెదిరింపు కాల్స్ చేస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, వారి రక్షణకు ప్రభుత్వం అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటుందని షిండే విజ్ఞప్తి చేశారు. 1990లలో ముంబైలో గ్యాంగ్ వార్లను ఏవిధంగా అయితే పూర్తిగా అణచివేశామో, ఇప్పుడు కూడా వాటిని మళ్లీ తలెత్తనివ్వమని ఆయన స్పష్టం చేశారు.
ఈ కాల్పుల ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ స్వయంగా ముంబై పోలీస్ కమిషనర్ దేవెన్ భారతితో పాటు నటుడు టైగర్ ష్రాఫ్‌తో మాట్లాడారు. పోలీస్ కమిషనర్‌ను వివరాలు అడిగి తెలుసుకున్న ఫడ్నవిస్, నిందితులను వెంటనే పట్టుకోవాలని, దర్యాప్తును వేగవంతం చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇక, ఈ ఘటనలో తాజాగా సంచలన విషయాలు వెలుగులో వచ్చాయి. ఈ దాడి వెనుక బైక్ పై వచ్చిన దుండగుల ప్రమేయం ఉన్నట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తేలింది. ముగ్గురు వ్యక్తులు ఓ బైక్‌పై రాగా, అందులో ఇద్దరు కాల్పులకు పాల్పడ్డారు. మూడో వ్యక్తి బైక్ స్టార్ట్ చేసి ఉంచడంతో వారు సులభంగా పరారయ్యారు. ఈ ఘటన తర్వాత బయటకు వచ్చిన ఓ వీడియోలో, ఒక నిందితుడు వరుసగా కాల్పులు జరుపుతుండగా, మరొకరు కూడా కాల్పులు జరపడానికి ప్రయత్నిస్తున్నట్లు స్పష్టంగా కనిపించింది. ఆ తర్వాత ముగ్గురూ కలిసి మోటార్ సైకిల్‌పై పారిపోయారు.
ఈ ఘటనకు సంబంధించి ఓ ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ.. కాల్పులు జరగడానికి సుమారు అర్ధగంట ముందు ఆ నిందితులు సమీపంలోని ఓ వడాపావ్ స్టాల్ దగ్గర కనిపించారని తెలిపారు. ఇద్దరు వ్యక్తులు కాల్పులకు పాల్పడగా, మూడో వ్యక్తి వారిని అక్కడి నుంచి తీసుకువెళ్లే పనిలో ఉన్నాడని, వాళ్లు పాత పల్సర్ బైక్‌పై వచ్చారని ఆ సాక్షి వెల్లడించారు. కాల్పులు శబ్దం వినిపించగానే ఆ ప్రాంతంలో ఒక్కసారిగా తీవ్ర భయాందోళనలు, గందరగోళం చెలరేగాయని చెప్పారు. టైగర్ ష్రాఫ్ డ్రైవర్ కూర్చున్న వైపు ఉండే కారు భాగంపైనే దుండగులు కాల్పులు జరిపినట్లు చెప్పారు. అంతేకాకుండా, గాయపడిన తన డ్రైవర్‌ను కారు వెనక సీట్లో కూర్చో బెట్టి.. స్వయంగా టైగర్ ష్రాఫ్ కారును డ్రైవ్ చేసుకుంటూ ఆసుపత్రికి వెళ్లారని తెలిపారు. అయితే, టైగర్ ష్రాఫ్ డ్రైవర్ పక్కనే ఉన్న ఫ్రంట్ ప్యాసింజర్ సీట్లో కూర్చుని ఉన్నారని మరొక ప్రత్యక్ష సాక్షి చెప్పారు. అయితే ఈ ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలన్నీ ప్రస్తుతం పోలీసుల పరిశీలనలో ఉన్నాయి. ఇక, ఈ కాల్పుల బాధ్యతను విదేశాల్లో తలదాచుకున్నట్లు చెబుతున్న గ్యాంగ్‌స్టర్లు అనిల్ పండిట్, హర్మన్ సంధులకు చెందిన సోషల్ మీడియా ఖాతా ద్వారా లారెన్స్ బిష్ణోయ్ పేరుతో ప్రకటించారు. ఈ ఘటనపై పోలీసులు ఇప్పటికే దర్యాప్తును వేగవంతం చేసి, నిందితులను గుర్తించి పట్టుకునేందుకు ఒకరిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.

