Site icon NTV Telugu

Tiger 3 Crackers: థియేటర్‌లో బాణసంచా కాల్చుతూ.. సల్మాన్‌ ఫ్యాన్స్‌ రచ్చ! వీడియో వైరల్

Tiger 3 Crackers

Tiger 3 Crackers

Salman Khan fans burst crackers while watching Tiger 3 in Malegaon: బాలీవుడ్‌ సూపర్ స్టార్, కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ హీరోగా నటించిన తాజా సినిమా ‘టైగర్‌ 3’. యశ్ రాజ్ ఫిలింస్ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ భారీ యాక్షన్ సినిమాకు మనీష్‌ శర్మ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో సల్మాన్‌ సరసన కత్రినా కైఫ్‌ నటించగా.. ఇమ్రాన్ హష్మీ కీలక పాత్ర చేశాడు. సల్మాన్‌, కత్రినాల కాంబోలో 2017లో వచ్చిన సూపర్‌ హిట్‌ చిత్రం ‘టైగర్‌ జిందా హై’కు సీక్వెల్‌ ఇది. భారీ అంచనాల మధ్య దీపావళి కానుకగా ఆదివారం (నవంబర్‌ 12) టైగర్‌ 3 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది.

టైగర్‌ 3 సినిమా విడుదల కోసం ఎప్పటినుంచో ఎదురుచుసిన సల్మాన్‌ ఖాన్‌ అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. రిలీజ్ నేపథ్యంలో థియేటర్‌ల ముందు భారీ కటౌట్లు పెట్టి.. బాణసంచా కాల్చుతూ నానా హంగామా చేశారు. అక్కడితో ఆగకుండా.. కొందరు అత్యుత్సాహంతో ఏకంగా థియేటర్‌ లోపల కూడా టపాకాయలు పేల్చారు. మహారాష్ట్ర మాలేగావ్‌లోని మోహన్‌ సినిమా థియేటర్‌లో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఫాన్స్ థియేటర్‌లో బాణసంచా కాల్చడంపై అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొరపాటున సీట్లకో, కార్పెట్‌కో నిప్పు అంటుకుంటే మంటలు థియేటర్‌ మొత్తం వ్యాపిస్తాయని.. అప్పుడు ప్రేక్షకుల పరిస్థితి ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేస్తున్నారు. థియేటర్‌లో బాణసంచా కాల్చడాన్ని ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. అయినా కూడా కొందరు ఫాన్స్ బాణసంచా కాల్చుతూ హంగామా సృష్టిస్తున్నారు.

Exit mobile version