విజయవాడ కృష్ణానదిలో సరదాగా ఈతకు వెళ్లిన యువకుల జీవితాల్లో తీరని విషాదం చోటుచేసుకుంది. విజయవాడలోని కృష్ణలంక ప్రాంతానికి చెందిన ఆరుగురు యువకులు ఈత కొట్టేందుకు గుంటూరు వైపు ఉన్న సీతానగరం పుష్కర ఘాట్ వద్దకు వెళ్లారు. నదిలో స్నానం చేస్తుండగా అకస్మాత్తుగా లోతు ఎక్కువ ఉన్న ప్రాంతానికి వెళ్లడంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు బాలురు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి నదిలో మునిగి మృతి చెందారు. మృతులను వేసాం గౌతం, గడ్డం జాషువా, తేజగా పోలీసులు గుర్తించారు. నీటిలో మునిగిపోతున్న వారిని గమనించిన స్థానికులు, మిగిలిన స్నేహితులు కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
సమాచారం అందుకున్న పోలీసులు, అత్యవసర సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. శ్రమించి ముగ్గురి మృతదేహాలను నీటి నుంచి బయటకు తీశారు. అనంతరం అవసరమైన ప్రక్రియ పూర్తి చేసి, మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఒకే ప్రాంతానికి చెందిన ముగ్గురు బాలురు ఒకేసారి మృతి చెందడంతో కృష్ణలంకలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. తీరని శోకంలో మునిగిపోయిన కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవరి తరమూ కావడం లేదు.
మరొక ఘటనలో.. తిరుపతి లీలామహల్ ప్రాంతంలో ఓ పానీపూరి బండి వద్ద గ్యాస్ లీకై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పానీపూరి బండి పూర్తిగా అగ్నికి ఆహుతైంది. అయితే స్థానికులు వెంటనే అప్రమత్తమై చాకచక్యంగా వ్యవహరించడంతో సిలిండర్ పేలలేదు. దీంతో తృప్తిలో పెద్ద ప్రమాదం తప్పిందని అంతా ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

