కర్ణాటకలోని రామ్ నగర్‌లో ఓ విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ నవజాత శిశువును విక్రయించిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు. 40 ఏళ్ల మహిళ తన 30 రోజుల నవజాత శిశువును రూ. 1.5 లక్షలకు విక్రయించింది. తన కొడుకు కనిపించడం లేదని, భార్యపై అనుమానం ఉందని మహిళ భర్త ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. భర్త అప్పు తీర్చేందుకే బిడ్డను భార్య అమ్మేసిందని చెబుతున్నారు.
READ MORE: Mohan Babu : పోలీసులు జారీ చేసిన నోటీస్ ని సవాలు చేసిన మోహన్ బాబు
పోలీసుల కథనం ప్రకారం.. భార్యాభర్తలిద్దరూ దినసరి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఐదుగురు పిల్లలు ఉన్నారు. ఇప్పటికే ఈ దంపతులు రూ.3 లక్షలకు పైగా అప్పులు చేశారు. ఎలాగైన అప్పులు తీర్చాలని ఆ భార్య తన బిడ్డను బెంగళూరుకు చెందిన మరో మహిళకు విక్రయించింది. భర్త కథనం ప్రకారం.. డిసెంబరు 5న సాయంత్రం పని ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చేసరికి బాబు కనిపించకుండా పోయాడు. శిశువుకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, బంధువుతో పాటు వైద్యుని వద్దకు పంపించినట్లు భార్య తెలియజేసింది. ఇది నమ్మి రాత్రి భోజనం చేసి నిద్రకు ఉపక్రమించాడు. మరుసటి రోజు ఉదయం తిరిగి వచ్చేసరికి బాబు జాడ కనిపించలేదు.
READ MORE:Manchu Family: మనోజ్- మోహన్ బాబు గొడవలో వెలుగులోకి ఆసక్తికర అంశాలు
భార్య మునుపటిలా అదే వివరణ ఇచ్చింది. దీంతో భర్తకు అనుమానం పెరిగింది. డాక్టర్ లేదా బంధువు కాంటాక్ట్ నంబర్ అడగగా, ఆమె ఇవ్వడానికి నిరాకరించింది. వారి మధ్య వాగ్వాదం జరిగి భర్త తలపై గాయమైంది. డిసెంబర్ 7న భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మహిళా పోలీసు బృందం ఆమెను విచారించగా, బిడ్డ తన బంధువు వద్ద ఉందని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. అయితే క్షుణ్ణంగా విచారించిన తర్వాత ఆమె బిడ్డను రూ. 1.5 లక్షలకు విక్రయించినట్లు అంగీకరించింది. పోలీసులు వెంటనే బెంగళూరు వెళ్లి చిన్నారిని స్వాధీనం చేసుకున్నారు. చిన్నారిని రక్షించి మండ్యలోని చైల్డ్ వెల్ఫేర్ సెంటర్‌కు తరలించి.. తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.