Site icon NTV Telugu

Tamil Nadu: నీట్‌ను రద్దు చేయాలని తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం..

New Project (13)

New Project (13)

నీట్‌-యూజీ 2024 ఎగ్జామ్‌ పేపర్ లీక్, నీట్‌-పీజీ 2024 పరీక్షను ఆకస్మికంగా వాయిదా వేయడంపై అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. ఈ తరుణంలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ శుక్రవారం నీట్‌ రద్దు తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. వైద్య విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జాతీయస్థాయి అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్) రద్దు చేయాలంటూ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. నీట్‌ను రద్దు చేయాలని, నీట్ అమలుకు ముందు మాదిరిగా 12వ తరగతి మార్కుల ఆధారంగా మెడికల్ అడ్మిషన్లు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలను అనుమతించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. మణితనేయ మక్కల్ కట్చి, మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం, తమిళగ వెట్రి కజగం, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) సహా పలు ప్రాంతీయ పార్టీలు ఈ తీర్మానానికి మద్దతు తెలిపాయి.

READ MORE: Andhra University: ఏయూ వీసీ, రిజిస్ట్రార్‌ రాజీనామాలు..

నీట్ పరీక్షపై తమిళనాడు ప్రభుత్వం ఎప్పటి నుంచో విభేధిస్తునే ఉంది. 2021లో కూడా తమిళనాడు అసెంబ్లీ నీట్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేసింది. తమిళనాడు విద్యార్థులకు నీట్‌ పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని తమిళనాడు అసెంబ్లీ ముక్తకంఠంతో కేంద్రానికి చాటింది. తమ రాష్ట్రంలో నీట్‌ పరీక్షను రద్దు చేస్తామని ప్రకటించారు తమిళనాడు సీఎం స్టాలిన్‌. అన్నాడీఎంకే కూడా నీట్‌ పరీక్షకు వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతు తెలిపింది. తీర్మానంపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి స్టాలిన్‌. బీజేపీకి అన్నాడీఎంకే మిత్రపక్షమని, నీట్‌ను రద్దు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఆ పార్టీ నేతలకు సూచించారు. అదే సమయంలో నీట్ లేకుండా మెడికల్ అడ్మిషన్ల కోసం తెచ్చిన బిల్లును తమిళనాడు అసెంబ్లీ ఆమోదించింది.

Exit mobile version