Tirumala Devotee: అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడైన శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. ఇప్పటికే స్వామి దర్శనార్థం ఏర్పాటు చేసిన క్యూలైన్లన్నీ నిండిపోయాయి. సర్వదర్శనానికి దాదాపు 40గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోందని ప్రకటించారు. కరోనా కారణంగా స్వామి దర్శనానికి వచ్చే భక్తుల రద్దీ ఇటీవల తగ్గింది.. కానీ మహమ్మారి శాంతించడంతో మళ్లీ తిరుమల ఆలయానికి భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది. దీంతో స్వామి వారి ఆదాయం కూడా పెరిగింది.
Read Also: Beggar Donates Money: బిచ్చగాడి గొప్ప మనసు.. వేల రూపాయలు విరాళం
శనివారం మొత్తం 57,104 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని, 32 వేల మంది తలనీలాలు ఇచ్చారని టీటీడీ అధికారులు చెప్పారు. స్వామి వారికి హుండీల ద్వారా ఆదాయం రూ.4.66 కోట్లు వచ్చిందని అధికారులు వెల్లడించారు. తిరుపతి చెక్ పాయింట్ వద్ద భక్తుల వాహనాలు బారులుదీరాయి. భద్రతా సిబ్బంది వాహనాలను క్షుణ్నంగా చెక్ చేస్తుండడంతో ట్రాఫిక్ స్లోగా నడుస్తోంది. శనివారం వర్షం పడడంతో చలి తీవ్రత పెరిగి భక్తులు ఇబ్బంది పడ్డారు. దర్శనానికి వచ్చిన భక్తులను కట్టడి చేసేందుకు భద్రతా సిబ్బంది నానాకష్టాలుపడుతున్నారు. ఆలయం ముందు భక్తులను ఇబ్బంది పెడుతున్న ఫొటోగ్రాఫర్లను కట్టడి చేయడానికి దేవస్థానం విజిలెన్స్ సిబ్బంది చర్యలు చేపట్టారు. అనుమతిలేకుండా గుడి ముందు ఫొటోలు తీస్తున్న వారి నుంచి కెమెరాలు లాక్కుని హుండీలో వేశారు. మరోసారి దొరికితే చర్యలు తప్పవని ఫొటోగ్రాఫర్లను అధికారులు హెచ్చరించారు. ఇటు కాణిపాకంలోనూ వారాంతం సెలవులతో భక్తుల రద్దీ పెరిగింది. వినాయకుడిని దర్శించుకునేందుకు భక్తులకు సుమారు 4 గంటలు పట్టింది.
Read Also: Water Overflowing From a Borewell : కరువు సీమలో అద్భుతం.. బోరు నుంచి ఉప్పొంగుతున్న నీరు