The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!

The Paradise Shankaranna

The Paradise Shankaranna

The Paradise Shankaranna: హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ది పారడైజ్’ సినిమా విడుదలైన తర్వాత ఒకవైపు థియేటర్లలో యాక్షన్ సన్నివేశాలు, మరోవైపు సోషల్ మీడియాలో చర్చలు హోరెత్తుతున్నాయి. అయితే సినిమాకు వచ్చిన టాక్‌ను మించి ఇప్పుడు ఒక పాత్ర తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. సినిమాలో ప్రియదర్శి పోషించిన ‘శంకరన్న’ పాత్ర మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను పోలి ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పాత్రకు సంబంధించిన సన్నివేశాలపై కేటీఆర్ స్పందించడం, దానికి కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ కౌంటర్ ఇవ్వడంతో సినిమా చుట్టూ రాజకీయ చర్చ మరింత వేడెక్కింది.

కేటీఆర్ థియేటర్‌కు వెళ్లడంతో మొదలైన కొత్త చర్చ

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సుదర్శన్ థియేటర్‌లో పార్టీ నేతలతో కలిసి ‘ది పారడైజ్’ సినిమాను చూశారు. ఆ తర్వాత సినిమా, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, హీరో నాని, ప్రియదర్శిని అభినందిస్తూ ఆయన స్పందించారు. ఈ సినిమా అణచివేతకు వ్యతిరేకంగా ఒక సమాజం చేసే పోరాటాన్ని, అస్తిత్వం కోసం జరిగే పోరును చూపించిందని కేటీఆర్ పేర్కొన్నారు. ఇంకా సినిమాలోని శంకరన్న పాత్రను కేటీఆర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు.

3 గంటల సినిమా ఒక ఎత్తు.. ఆ 4 నిమిషాలు ఒక ఎత్తు

సినిమాలో కేసీఆర్‌ను పోలిన పాత్ర కనిపించిన సుమారు 4 నిమిషాల సన్నివేశంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రధాన చర్చగా మారాయి. సినిమా మొత్తం మూడు గంటలు ఉంటే.. ఆ నాలుగు నిమిషాలు మాత్రం ప్రత్యేకంగా అనిపించాయని ఆయన కేటీఆర్ అన్నారు. తమ పార్టీకి, సినిమాకు ఎలాంటి సంబంధం లేకపోయినా ఒక నాయకుడిని, తెలంగాణ ఉద్యమంతో ముడిపడిన నాయకత్వాన్ని సినిమాలో గుర్తు చేసుకున్న విధానం తనను ఆకట్టుకుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రజల్లో కేసీఆర్ పట్ల ఉన్న అనురాగం, మమకారం తగ్గలేదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ నుంచి కౌంటర్

అయితే కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ స్పందించారు. ‘పారడైజ్’లోని పాత్రను ఆధారంగా చేసుకుని బీఆర్‌ఎస్ నేతలు రాజకీయ ప్రచారం చేసుకుంటున్నారని ఆయన విమర్శించారు. సినిమాలోని పాత్రలకు, వాస్తవ రాజకీయాలకు సంబంధం లేదనే అంశాన్ని పక్కన పెట్టి బీఆర్‌ఎస్ నేతలు సంబరాలు చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ పాలన, బీఆర్‌ఎస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలకు జరిగిన నష్టాలకు బాధ్యత ఎవరిదంటూ ప్రశ్నలు సంధించారు. దీంతో సినిమా పాత్రపై మొదలైన చర్చ కాస్తా రెండు పార్టీల మధ్య రాజకీయ విమర్శలు, ప్రతివిమర్శలకు దారితీసింది.

శంకరన్న పాత్ర కోసం ప్రియదర్శి ప్రత్యేకంగా సిద్ధం

ప్రియదర్శి పోషించిన శంకరన్న పాత్ర ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షిస్తోంది. కేసీఆర్‌ను పోలిన హావభావాలు, గెటప్, తెలంగాణ యాసతో ప్రియదర్శి కనిపించడం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. పాత్ర కోసం కేసీఆర్ దుస్తులు, చెప్పులు, బాడీ లాంగ్వేజ్ వంటి అంశాలను పరిశీలించి సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే ‘ది పారడైజ్’లోని శంకరన్న పాత్రను కేసీఆర్‌ ఆధారంగా రూపొందించినట్లు అధికారికంగా ప్రకటించలేదు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ కథ, పాత్రలు కల్పితమైనవేనని, తన తెలంగాణ అనుభవాలు, వాస్తవ ఘటనల నుంచి ప్రేరణ పొందిన అంశాలు సినిమాలో ఉన్నాయని అన్నారు.

మొత్తానికి తెరపై కొద్ది నిమిషాలు కనిపించిన శంకరన్న పాత్ర ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో మాత్రం పెద్ద చర్చకు కారణమైంది. కేటీఆర్ ప్రశంసలు, కాంగ్రెస్ కౌంటర్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఎడిటెడ్ వీడియోలతో ‘ది పారడైజ్’ సినిమాకు ఒక ప్రత్యేకమైన పొలిటికల్ యాంగిల్ కూడా వచ్చి చేరింది.