Site icon NTV Telugu

MS Dhoni IPL Retirement: రిటైర్మెంట్‌పై ఎంఎస్ ధోనీ కీలక వ్యాఖ్యలు.. ఏమన్నాడంటే?

Ms Dhoni Ipl Retirement

Ms Dhoni Ipl Retirement

చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్, లెజెండరీ వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీ గురించి ఈరోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ధోనీ రిటైర్మెంట్‌ ఇస్తున్నాడని, ఐపీఎల్‌లో నేడు చివరి మ్యాచ్ ఆడుతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్ అనంతరం తన రిటైర్మెంట్‌పై మహీ స్వయంగా స్పందించాడు. తనకు నిర్ణయం తీసుకోవడానికి ఇంకా 4-5 నెలల సమయం ఉందని, ఇప్పుడే తొందరేమీ లేదని తెలిపాడు. తాను రిటైర్మెంట్‌ ఇస్తానని చెప్పడం లేదని, అలాగని వచ్చే ఏడాది ఆడుతానని కూడా చెప్పడం లేదని ధోనీ చెప్పుకొచ్చాడు.

ఎంఎస్ ధోనీ మాట్లాడుతూ… ‘రిటైర్మెంట్‌పై నిర్ణయం తీసుకోవడానికి నాకు ఇంకా 4-5 నెలల సమయం ఉంది. ఇప్పటికిప్పుడు తొందరేమీ లేదు. ప్రతి సంవత్సరం శరీరాన్ని ఫిట్‌గా ఉంచడానికి ఎక్కువ శ్రమించాల్సి వస్తోంది. ఇది ప్రొఫెషనల్ క్రికెట్ కాబట్టి ఫిట్‌నెస్‌ ఉత్తమంగా ఉండాలి. క్రికెటర్లు పెర్ఫామెన్స్‌ కారణంగా రిటైర్ కావాల్సి వస్తే.. కొందరు 22 సంవత్సరాల వయస్సులో రిటైర్ అవుతారు. ఇక్కడ మీరు ఎంత పరుగుల దాహంతో ఉన్నారు, ఎంత ఫిట్‌గా ఉన్నారో ముఖ్యం. మీరు జట్టుకు ఎంత సహకరించగలరు, జట్టుకు మీరు అవసరమా అనేది కూడా ముఖ్యమే. నాకు తగినంత సమయం ఉంది. కొంతకాలంగా ఇంటికి వెళ్లలేదు, రాంచీకి తిరిగి వెళ్తాను. నేను కొన్ని బైక్ రైడ్‌లను ఆస్వాదిస్తాను. ఆ తరువాత నిర్ణయం తీసుకుంటాను. నేను రిటైర్మెంట్‌ ఇస్తానని చెప్పడం, అదే సమయంలో తిరిగి వస్తున్నానని చెప్పడం లేదు. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను’ అని చెప్పాడు.

ఐపీఎల్‌ 2025ని చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఘన విజయంతో ముగించింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్‌ను 83 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. లీగ్ చివరి మ్యాచ్‌లో చెన్నై ముందుగా 5 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. డేవాన్ కాన్వే (52; 35 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ బాదాడు. భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్ 18.3 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. సాయి సుదర్శన్ (41) టాప్ స్కోరర్. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్ తలో మూడు వికెట్స్ పడగొట్టారు.

 

Exit mobile version