NTV Telugu Site icon

Telangana: తెలంగాణలో రోడ్డెక్కిన పోలీస్ కానిస్టేబుళ్ల కుటుంబాలు.. ఎందుకంటే..?

Tg Constables

Tg Constables

తెలంగాణలో పోలీస్ కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు రోడ్డెక్కారు. బెటాలియన్ కానిస్టేబుళ్లుగా పని చేస్తున్న భర్తల కోసం భార్యలు ధర్నాకు దిగారు. తెలంగాణ వ్యాప్తంగా పలు నగరాల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. టీజీఎస్పీ హఠావో.. ఏక్ పోలీస్ బనావో అంటూ నినాదాలు చేశారు. కర్ణాటక రాష్ట్రంలో ఉన్న పోలీస్ విధానాలను తెలంగాణలోనూ అమలు చేయాలని డిమాండ్ చేశారు. 8 గంటలకు మించి బెటాలియన్ కానిస్టేబుళ్లకు డ్యూటీ వేస్తుండటాన్ని నిరసిస్తూ ధర్నాకు దిగారు.

నెలలో నాలుగు రోజులు మాత్రమే సెలవు ఇస్తే ఎలా అంటూ ప్రశ్నించారు. తమ భర్తలతో కూలీ పనులు, చెత్త ఏరే పనులు, మట్టి పనులు చేయిస్తున్నారని ఆరోపించారు. కానిస్టేబుళ్లతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారని వాపోయారు. తరచూ పోస్టింగులు మారుస్తూ ఉండటంతో పిల్లల చదువులకు ఇబ్బంది ఎదుర్కొవాల్సి వస్తుందని అన్నారు. తమ సమస్యలు పరిష్కారించాలని కానిస్టేబుళ్ల సతీమణులు ధర్నాకు దిగారు. డిచ్‌పల్లి, హాజీపూర్, సిరిసిల్లలో ఆందోళన చేసిన కానిస్టేబుళ్ల భార్యలు, కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Read Also: Underwater Wedding: సాహసోపేత వివాహం.. ఏకంగా సముద్రం అడుగున జంట పెళ్లి..

నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలోని 7వ బెటాలియన్ పోలీస్ కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు.. బెటాలియన్ ఎదుట జాతీయ రహదారిపై ధర్నా చేశారు. 8 గంటలకు మించి కానిస్టేబుళ్లు డ్యూటీ చేస్తుండటంతో.. ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బెటాలియన్ పోలీసులకు ఐదేళ్ల పాటు ఒకే దగ్గర పోస్టింగ్ ఇవ్వాలని కోరారు. తమ సమస్యలను పరిష్కారించాలని డిచ్‌పల్లిలోని 7వ బెటాలియన్ ఎదుట ఆందోళన చేస్తున్న కానిస్టేబుళ్ల భార్యల ధర్నా చూసి.. అదే మార్గంలో వెళ్తున్న మాజీ మంత్రి కేటీఆర్ ఆగారు. ఆందోళనకారులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా.. వారి ధర్నాకు మద్దతు తెలిపారు.

మంచిర్యాల జిల్లాలో పోలీస్ కానిస్టేబుళ్ల భార్యలు రోడ్డెక్కారు. హాజీపూర్ మండలం గుడిపేట టీజీఎస్పీ 13వ పోలీస్ పటాలంలో పని చేసే పోలీసుల భార్యలు రాస్తారోకో చేపట్టారు. పోలీస్ కానిస్టేబుళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న తమ భర్తలు ఇంటికి దూరంగా ఉంటున్నారని… నెలలో నాలుగు రోజులు మాత్రమే ఇంట్లో ఉంటున్నారని వాపోయారు. ఉద్యోగాల పేరుతో తమకు దూరం చేస్తున్నారని.. ఇకనైనా ఒక రాష్ట్రం, ఒక పోలీస్ విధానం అమలులోకి తేవాలని డిమాండ్ చేశారు.