NTV Telugu Site icon

AP Govt: వచ్చే ఏడాది ఆర్ధిక బ‌డ్జెట్‌పై ఏపీ ప్రభుత్వం క‌స‌రత్తు..

Ap Budjet

Ap Budjet

వచ్చే ఏడాది ఆర్ధిక బ‌డ్జెట్‌పై ఏపీ ప్రభుత్వం క‌స‌రత్తు దాదాపు పూర్తయింది. ఆయా శాఖ‌లు ప్రతిపాద‌న‌లు ఆర్ధిక శాఖకు అందించే పనిలో ఉన్నాయి. గ‌త బ‌డ్జెట్‌ల కంటే భిన్నంగా కూట‌మి స‌ర్కార్ బ‌డ్జెట్ ప్రవేశ పెట్టె ఆలోచనలో ఉంది. సంక్షేమం, అభివృద్ధికి స‌మ ప్రాధాన్యం ఇవ్వాల‌ని కుట‌మి స‌ర్కార్ భావిస్తోంది. కుట‌మి స‌ర్కార్‌కు సూపర్ సిక్స్ పెద్ద స‌వాల్‌గా మారింది. సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాలతో పాటు.. ఇరిగేష‌న్, అమ‌రావ‌తి, గ్రామీణ, ప‌ట్టణ ప్రాంతాల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా బ‌డ్జెట్‌లో ఫోక‌స్ పెట్టనుంది.

2025-26 ఆర్ధిక సంవ‌త్సరానికి బ‌డ్జెట్ త‌యారీపై ఆర్ధిక శాఖ క‌స‌రత్తు ఒక కొలిక్కి వస్తోంది. వచ్చే నెల చివరి నుంచి అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. దీనిలో భాగంగా వ‌చ్చే ఏడాది ఆర్ధిక బ‌డ్జెట్ పై ఆర్ధిక శాఖ క‌స‌ర‌త్తు పూర్తి చేస్తోంది. అయితే గ‌త ప్రభుత్వ పాల‌న‌లో ప్రవేశ పెట్టిన బ‌డ్జెట్‌ల‌కు భిన్నంగా బ‌డ్జెట్ రూప‌క‌ల్పన చేయాలని కుట‌మి స‌ర్కార్ భావిస్తోంది. గ‌త ప్రభుత్వం ఏకంగా 7 ల‌క్షల కోట్లకు పైగా అప్పులు చేసింది. కానీ దానికి స‌మాంత‌రంగా అభివృద్ది జ‌ర‌గ‌లేదని ప్రభుత్వం భావిస్తోంది. ఇదే క్రమంలో గ‌త ప్రభుత్వం 1.5 ల‌క్షల కోట్లు బిల్లులు పెండింగ్‌లో పెట్టింది. రాష్ట్ర అదాయంలో కీల‌కంగా ఉండాల్సిన అమ‌రావ‌తి, పోల‌వ‌రం లాంటి ప్రాజెక్ట్‌ల‌కు ప్రాధాన్యత ఇచ్చేలా బడ్జెట్ ఉండనుంది. గత కొంత కాలంగా.. అప్పులు తీర్చడానికే అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తోంది. ఆర్ధిక ప‌రిస్థితిని చ‌క్కదిద్దేలా సీఎం చంద్రబాబు ప్రయ‌త్నాలు చేస్తునే ఉన్నారు. 95 కేంద్ర ప్రభుత్వ పథకాల‌ను గ‌త ఐదేళ్ల పాటు అమ‌లు చేయ‌కపోవ‌డం వల‌న రాష్ట్రం అభివృద్దిలో కీల‌క శాఖ‌లు న‌ష్ట పోయాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇదే స‌మ‌యంలో కేంద్రం నుండి రాష్ట్ర వాటాగా రావాల్సిన అనేక వేల కోట్ల నిధులు నిరుప‌యోగంగా ఉన్నాయి. కూట‌మి స‌ర్కార్ అధికారంలోకి వ‌చ్చాక‌.. 95 కేంద్ర ప‌థకాల‌కు గాను ఇప్పటి వ‌ర‌కు 74 ప‌థకాల‌ను సీఎం చంద్రబాబు గాడిలో పెట్టే ప్రయ‌త్నం చేశారు. ఇంకా రాష్ట్ర ఆర్ధిక ప‌రిస్థితి గాడిలో ప‌డ‌లేదు..

Breast Cancer: రొమ్ము క్యాన్సర్‌కు సంబంధించి శుభవార్త.. ఒకే డోస్‌లో ట్యూమర్‌ తొలగింపు?

ఇలాంటి ప‌రిస్థితుల్లో 2025 – 26 ఆర్ధిక సంవ‌త్సరానికి గాను బ‌డ్జెట్ రాష్ట్రానికి ఒక ఎజెండాలా ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. వివిధ శాఖల‌తో ఆర్ధిక శాఖ స‌మావేశాలు ఏర్పాటు చేసింది. వచ్చే ఏడాది గాను శాఖల అవ‌స‌రాలు, ఎంత నిధులు అవ‌స‌రం అవుతాయి అన్న దానిపై ఆయా శాఖ‌ల నుండి ప్రతిపాద‌న‌లు తీసుకుంది.. వ‌చ్చే బ‌డ్జెట్ కూర్పు ఏపీ ఆర్ధిక శాఖ అధికారుల‌కు స‌వాల్ గా మారింది. ఒక ప‌క్క భారీగా అప్పుల భారం, మ‌రో వైపు బిల్లులు చెల్లింపులు భారం. ఇదే క్రమంలో అస్తవ్యస్తంగా మారిన ఆర్ధిక వ్యవ‌స్థను చ‌క్కదిద్దే ప‌నిలో ప‌డింది. ప్రభుత్వం సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాలు కొన్ని ప్రారంభించినా.. త‌ల్లికి వంద‌నం, 18 సంవత్సరాలు దాటిన ప్రతి మ‌హిళ‌కు నెల‌కు 1500 రుపాయిలు చెల్లింపు వంటివి కుట‌మి స‌ర్కార్‌కు అతి పెద్ద స‌వాల్‌గా ఉన్నాయి.

దీనికి తోడు మ‌రికొన్ని సంక్షేమ కార్యక్రమాలు అమ‌లుకు సంబంధించి కూడా బడ్జెట్‌లో దృష్టి పెట్టాలి. గ‌త ప్రభుత్వంలో కేవ‌లం సంక్షేమంపై దృష్టి పెట్టి.. రాష్ట్ర అభివృద్దికి కీల‌క‌మైన రంగాల‌కు నిధులు కేటాయింపు ప‌ట్ల నిర్లక్ష్యం జరిగిందనే విమర్శలు ఉన్నాయి. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెర‌గ‌క పోగా ఖ‌ర్చులు భారీగా పెరిగాయి. ఇప్పుడు ప్రవేశ పెట్టే బ‌డ్జెట్ ఇలాంటి అంశాల‌ను దృష్టిలో పెట్టుకుని బ‌డ్జెట్ త‌యారు చేయ‌డం ఆర్ధిక శాఖ అధికారుల‌కు క‌త్తిమీద సాములా మారింది. ఒక ప‌క్క రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అమ‌రావతి నిర్మాణ‌, పోల‌వ‌రం నిర్మాణం పూర్తి, ఇదే క్రమంలో ఒక ప‌క్క గ్రామాల‌లో మౌళిక వ‌స‌తులు క‌ల్పన.. ఇంకో వైపు ప‌ట్టణాల‌లో వ‌స‌తుల క‌ల్పనపై ప్రత్యేకంగా దృష్టి సారించ‌నుంది. ఎన్నిక‌ల హామీల‌ను ఒక్కోక్కటిగా ద‌శల వారిగా అమ‌లు చేయ‌డం, రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖ‌ల ప‌ట్ల స‌మ‌ప్రాధాన్యం ఇవ్వడంపై ఆర్ధిక శాఖ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.