Site icon NTV Telugu

Cinema : రూ. 9 కోట్ల బడ్జెట్‌తో తీస్తే ఏకంగా రూ. 50 కోట్లు వసూలు చేసింది

Radhika

Radhika

ఈ రోజుల్లో భారీ బడ్జెట్ సినిమాలు, స్టార్ హీరోల చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద నిలబడటానికి కష్టపడుతుంటే, ఒక చిన్న చిత్రం మాత్రం సంచలనాలు సృష్టిస్తోంది. సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ‘తాయి కిళవి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. కేవలం రూ. 9 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ. 51.16 కోట్లు వసూలు చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

ఈ సినిమా విజయానికి ప్రధాన కారణం రాధికా శరత్ కుమార్ నటన అనడంలో అతిశయోక్తి లేదు. 63 ఏళ్ల వయసులో ఆమె చూపించిన ఎనర్జీ, మాస్ మేనరిజమ్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. ‘పవునుత్తాయి’ అనే పక్కా ఊర మాస్ పాత్రలో ఆమె పరకాయ ప్రవేశం చేశారు. తనదైన మేనరిజమ్స్, డైలాగ్ డెలివరీతో థియేటర్లలో ఈలలు వేయిస్తున్నారు. విడుదలైనప్పటి నుండి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ చిత్రం, కేవలం 10 రోజుల్లోనే రూ. 51 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ట్రేడ్ అనలిస్టుల అంచనా ప్రకారం, ఇదే జోరు కొనసాగితే త్వరలోనే ఈ చిన్న సినిమా రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. 2026లో ఇప్పటివరకు విడుదలైన తమిళ చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో సినిమాగా నిలిచి ఈ చిత్రం రికార్డు సృష్టించింది. స్టార్ హీరో శివకార్తికేయన్ నిర్మాణంలో దర్శకుడు శివకుమార్ మురుగేశన్ అద్భుతమైన మేకింగ్ తో మెప్పించాడు. కంటెంట్ బలంగా ఉంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని ఈ సినిమా మరోసారి నిరూపించింది. భారీ సెట్లు, గ్రాఫిక్స్ కంటే కథలో దమ్ముంటే చాలని ‘తాయి కిళవి’ విజయం చాటి చెబుతోంది.

Exit mobile version