Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలలో “తల్లికి వందనం” (Thalliki Vandanam) కీలకమైనది. విద్యకు ప్రోత్సాహంగా తల్లుల ఖాతాలకు నేరుగా ఆర్థిక సహాయం అందించే ఈ పథకం లక్షలాదిమంది విద్యార్థులకు మేలు చేస్తోంది. అయితే, ఈ పథకానికి అర్హత పొందాలంటే కొన్ని నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
కుటుంబ ఆదాయం నెలకు గ్రామీణ ప్రాంతాల్లో రూ. 10,000/-కి మించకూడదు. అలాగే పట్టణ ప్రాంతాల్లో రూ. 12,000/-కి మించకూడదు. కుటుంబంలో కనీసం ఒకరైనా రేషన్ కార్డు (రైస్ కార్డ్) కలిగి ఉండాలి. ఇక భూమి సంబంధించిన వివరాలు చూస్తే.. తడి భూమి 3 ఎకరాల లోపుగా ఉండాలి. లేదా పొడి భూమి 10 ఎకరాల లోపుగా ఉండాలి.. లేదా తడి + పొడి భూములు కలిపి 10 ఎకరాల లోపుగా ఉండాలి.
Read Also: CM Chandrababu Naidu: ఆ ఆటలు నా దగ్గర సాగవు.. తోక తిప్పితే ఎవ్వరిని ఉపేక్షించను..!
ఇంకా కుటుంబంలోని ఎవరైనా వ్యక్తి 4-వీల్ వాహనం (కార్లు) కలిగి ఉంటే అర్హత లేదు. (టాక్సీలు, ట్రాక్టర్లు, ఆటోలు మినహాయింపు). 12 నెలల సరాసరి ఆధారంగా, గృహంలో విద్యుత్ వినియోగం నెలకు 300 యూనిట్లలోపు ఉండాలి (ఇంటివైనా, అద్దెకు ఉన్నవైనా సరే). కుటుంబం 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ మున్సిపల్ ఆస్తి కలిగి ఉండరాదు. కుటుంబ సభ్యుల్లో ఎవరిదైనా కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం, PSU, లేదా ప్రభుత్వ పెన్షన్ పొందుతున్న వారు ఉంటే అర్హత లేదు. అయితే, పారిశుద్ధ్య కార్మికులు ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో రూ.10,000/-కంటే తక్కువ జీతం పొందే ఉద్యోగులు, పట్టణ ప్రాంతాల్లో రూ. 12,000/- కంటే తక్కువ జీతం పొందేవారు మినహాయింపులోకి వస్తారు.
ఇంకా కుటుంబంలో ఎవరైనా ఇన్‌కమ్ టాక్స్ చెల్లిస్తే, అర్హత లేదు. లబ్ధిదారుడు పేరుతో కుటుంబ వివరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డేటాబేస్‌లో ఉండాలి. లేదంటే, విద్యార్థి డేటాబేస్ లో ఉన్న పక్షంలో GSWS శాఖ వారు ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి అర్హత నిర్ధారిస్తారు. లబ్ధిదారుని పిల్లలు 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఎయిడెడ్ లేదా ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూల్స్ లేదా జూనియర్ కాలేజీలు, రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన పాఠశాలల్లో చదవాలి. (కానీ, ITI, పాలిటెక్నిక్, RGUKT వంటి కోర్సులు చదివే విద్యార్థులు అర్హులుకారు.)
Read Also: Thalliki Vandanam Scheme: 67 లక్షలకు పైగా పిల్లలకు ‘తల్లికి వందనం’.. రూ.2000 కట్.. ఎందుకంటే..?
అలాగే అనాథలు, వీధి పిల్లలు వాలంటరీ సంస్థల ద్వారా పాఠశాలలో చేరితే సంబంధిత శాఖ నిర్ధారణ ఆధారంగా అర్హులవుతారు. డీబీటీ (DBT) అమలు కోసం తల్లి బ్యాంక్ ఖాతా ఆధార్ NPCI లింకింగ్ పూర్తిగా ఉండాలి. ఈ అకడమిక్ సంవత్సరంలో 75% అటెండెన్స్ ఉన్న విద్యార్థులకు వచ్చే సంవత్సరంలో సహాయం కొనసాగుతుంది. విద్యార్థి మిడిల్‌లో చదువు మానేస్తే లేదా 75% హాజరు లేకపోతే, తదుపరి సంవత్సరానికి అర్హత ఉండదు.