NTV Telugu Site icon

Viajayanagaram: ఉపాధ్యాయుడు కృష్ణ హత్యకేసు.. ఉద్దవోలులో ఉద్రిక్తత

Uddavolu

Uddavolu

Viajayanagaram: విజయనగరం జిల్లా తెర్లాం మండలం ఉద్దవోలులో ఉద్రిక్తత కొనసాగుతోంది. ప్రభుత్వ ఉపాధ్యాయుడు కృష్ణ హత్య కేసులో నిందితుడు వెంకటనాయుడు ఇంటిపై మృతుడి బంధువులు దాడికి యత్నించారు. ఈ నేపథ్యంలో అక్కడ పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. నిందితుడి చిన్నాన అప్పలనాయుడు, అతడి భార్య వాళ్లింట్లో ఉన్న విషయాన్ని తెలుసుకుని మహిళలు, యువత పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అప్పల నాయుడి ఇంటిపై మహిళలు రాళ్లదాడి చేశారు. నిందితులకు వ్యతిరేకంగా వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వెంకటనాయుడు ఇంటిపై దాడికి యత్నించినవారిని పోలీసులు అడ్డుకున్నారు. అప్పలనాయుడిని తమకు అప్పగించాలని డిమాండ్‌ చేశారు. ఆ తర్వాత వేరే మార్గంలో అప్పలనాయుడు, అతడి భార్యను రాజాం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఉద్దవోలులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు.

మృతుడి కుమారుడు శ్రావణ్ కుమార్ ఫిర్యాదు మేరకు ఉద్ధవోలుకు చెందిన మరడాన వెంకట నాయుడు, మోహనరావు, గణపతి, రామస్వామిలపై కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో హత్యగా నిర్థారణ కావడంతో.. పోలీసులు నేడు వెంకటనాయుడిని అరెస్ట్ చేశారు.  ఉపాధ్యాయుడు కృష్ణను రాజకీయ కక్షతోనే హత్యచేశారని, వారిని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. ఉద్ధవోలులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో.. భారీగా పోలీసులు మోహరించారు. హత్యకు గురైన ఉపాధ్యాయుడు కృష్ణ తెర్లాం మండలం ఉద్దవోలు టీడీపీ సర్పంచిగా 1988 నుంచి 1995 వరకూ పనిచేశారు. 1998లో ఆయనకు ఉపాధ్యాయుడిగా ఉద్యోగం రావడంతో.. ఆయన ఎవరికి మద్దతు తెలిపితే వారే గ్రామానికి సర్పంచిగా గెలిచేవారు. ప్రస్తుతం సర్పంచిగా ఉన్న సునీత 2021లో ఆయన మద్దతుతోనే గెలిచింది. ఆ తర్వాత వారిద్దరూ వైసీపీలో చేరారు. అప్పటికే ఆ పార్టీలో ఉన్న వెంకటనాయుడు దీన్ని జీర్ణించుకోలే పథకం ప్రకారం కృష్ణను హత్యచేసినట్లు ఆయన భార్య జోగేశ్వరమ్మ, కుమారుడు శ్రావణ్‌కుమార్‌, కుమార్తె ఝాన్సీతో పాటు బంధువులు ఆరోపిస్తున్నారు.

Also Read: Chennai: మాంత్రికుడుని చంపిన స్నేహితుడు ….

అసలేం జరిగిందంటే.. విజయనగరం జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడిని పథకం ప్రకారం దారుణంగా హత్య చేశారు. వాహనంతో ఢీకొట్టి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు విఫలయత్నం చేశారు. వివరాల్లోకి వెళితే.. ఈ ఘటన శనివారం ఉదయం చోటుచేసుకుంది. రాజాం సీఐ రవికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని రాజాంలో నివాసముంటున్న ఏగిరెడ్డి కృష్ణ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. శనివారం ఉదయం తన ఇంటి నుంచి బైక్‌పై తెర్లాం మండలం కాలంరాజుపేటలోని పాఠశాలకు విధుల నిమిత్తం వెళ్తున్నారు. ఒమ్మి దగ్గరకు రాగానే కొందరు వ్యక్తులు బొలెరోలో వాహనం కృష్ణను వెంబడించి అతన్ని వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది..ఈ ఘటనలో తీవ్రగాయాల పాలైన కృష్ణ అక్కడికక్కడే చనిపోయారు. ప్రమాదం జరిగిన తీరును బట్టి ఇది పక్కా హత్య అంటూ గ్రామస్థులు ఘటనాస్థలం వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు.