Site icon NTV Telugu

Tamilnadu: దళితుల ప్రవేశానికి నిరాకరణ.. ఒక గుడికి సీల్‌, మరో ఆలయం తాత్కాలికంగా మూసివేత

Tamilnadu

Tamilnadu

Tamilnadu: తమిళనాడు రాష్ట్రంలో ఒక గుడికి సీల్ వేశారు, మరో ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. కారణం, షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారికి ఆలయంలోకి రాకుండా కొందరు వ్యక్తులు ప్రవేశం నిరాకరించడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. సీల్ వేసిన గుడి తమిళనాడులోని విల్లుపురం జిల్లాలోని మెల్పాడి సమీపంలోని ద్రౌపది అమ్మన్ ఆలయం కాగా.. వీరనంపట్టిలోని కాళియమ్మన్ ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు.

ద్రౌపది అమ్మన్ ఆలయానికి సంబంధించి ఆధిపత్య కులాలకు, ఎస్సీలకు మధ్య కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో దళితులకు ఆలయంలోకి ప్రవేశం నిరాకరించడంతో వివాదం చెలరేగింది. శాంతిభద్రతలు దెబ్బతింటాయిన భయపడ్డ జిల్లా అధికారులు బుధవారం ఆలయానికి సీలు వేశారు. వాస్తవానికి ఇరు వర్గాల మధ్య ప్రతిష్టంభనను తొలగించేందుకు జిల్లా యంత్రాంగం పలు దఫాలుగా చర్చలు జరిపినప్పటికీ సమస్యపై సామరస్యపూర్వక పరిష్కారం లభించలేదు. ద్రౌపది అమ్మన్ దేవాలయం హిందూ మత ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తోంది.. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి ఆలయంలోకి ప్రవేశించాడని, దీనిపై ఆధిపత్య కులస్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం దళితులను ఆలయంలోకి రానీయకుండా ఆదేశాలు ఇచ్చారు. అప్పటి నుంచి రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణ కారణంగా నాలుగు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయబడ్డాయి. దీంతో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా ఆలయానికి జిల్లా అధికారులు సీల్ వేశారు. ఇదిలా ఉండగా.. కులమతాలకు అతీతంగా భక్తులను ఆలయంలోకి అనుమతించాలని కోరుతూ విల్లుపురం ఎంపీ డి.రవికుమార్, ఇతర పార్టీ నేతలు సోమవారం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం కూడా సమర్పించారు.

Read Also: Congress: ఇందిరాగాంధీ హత్యను సెలబ్రేట్ చేసుకున్న ఖలిస్తానీవాదులు.. చర్యలకు కాంగ్రెస్ డిమాండ్..

ఇదిలా ఉండగా.. షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) కమ్యూనిటీకి చెందిన వారికి కొందరు వ్యక్తులు ప్రవేశం నిరాకరించడంతో వీరనంపట్టిలోని కాళియమ్మన్ ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఆలయంలో ఇటీవల జరిగిన వైకాసి పండుగ సందర్భంగా దళితులు తమపై వివక్ష చూపుతున్నారని, లోపలికి అనుమతించడం లేదని ఆరోపించడంతో గొడవ జరిగింది. కాళియమ్మన్ ఆలయం ఈ ప్రాంతంలో ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. అందులో కాళీ దేవి చెక్క విగ్రహం ప్రతిష్టించబడింది. ఈ ఆలయానికి ప్రతి సంవత్సరం తమిళనాడు, పుదుచ్చేరి నుంచి భక్తులు తండోపతండాలుగా వస్తారు. . ఈ ఏడాది వైకాసి పండుగ సందర్భంగా చుట్టుపక్కల ఎనిమిది గ్రామాలకు చెందిన పలువురు ఉత్సవాల్లో పాల్గొన్నారు.

Read Also: Heart Attack: 30-40 ఏళ్లలో గుండెపోటు.. యువతలో పెరుగుతున్న ముప్పు.. కారణాలు ఇవే..

వీరిలో 80 కుటుంబాలు షెడ్యూల్డ్ కులానికి చెందినవి. ఈ కుటుంబాలలో కొందరు తాము ఆలయంలో నిరంతరం కుల వివక్షను ఎదుర్కొంటున్నామని, వారికి ప్రవేశం, వైకాసి పండుగలో పాల్గొనడానికి కూడా అనుమతి లేదని పేర్కొన్నారు. తమపై వివక్ష చూపుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. సమస్యను కడవూరు తహశీల్దార్ మునిరాజ్ దృష్టికి తీసుకెళ్లి ఇరువర్గాలతో చర్చలు జరిపారు. అయితే, సామరస్యపూర్వక పరిష్కారం లభించలేదు.దీంతో పరిష్కారం లభించే వరకు ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఆలయాన్ని ఎప్పుడు తెరుస్తారనే దానిపై ఆలయ అధికారులు స్పష్టత ఇవ్వలేదు.

Exit mobile version