Srinivasa Rao: గత పదేళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమ అదుపు తప్పిందని సీనియర్ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు అన్నారు. గిల్డ్ పేరుతో కొంతమంది నిర్మాతలు కలిసి స్వార్థపూరితంగా వ్యవహరించడమే ఇందుకు ప్రధాన కారణమని ఆరోపించారు. వచ్చే ఆదివారం జరగనున్న తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ఎన్నికల నేపథ్యంలో తమ ప్యానెల్ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. గిల్డ్ సభ్యుల వల్లే ఈ ఏడాది సినిమా షూటింగ్‌లు నిలిచిపోయాయని చెప్పారు. కార్మికుల సమస్యలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతోనే పరిష్కారం అయ్యాయని తెలిపారు.
వాణిజ్య మండలి పరిష్కరించాల్సిన సమస్యలు ముఖ్యమంత్రి స్థాయికి వెళ్లడం బాధాకరమని అన్నారు. చిన్న నిర్మాతలు, కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా మన ప్యానెల్ నాలుగు విభాగాల్లో పోటీ చేస్తుంది. మమ్మల్ని గెలిపిస్తే ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటాం.. అవసరమైతే అర్ధరాత్రి కూడా స్పందిస్తామన్నారు.. అనంతరం.. నిర్మాత సి.కల్యాణ్ మాట్లాడుతూ, తాము ఎప్పుడూ చిన్న నిర్మాతలకు అండగా ఉంటామని, అందుకే చిన్న నిర్మాతలంతా మన ప్యానెల్‌కు మద్దతుగా ఉన్నారని అన్నారు.