Film Federation: తెలుగు సినీ పరిశ్రమలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఫిల్మ్ ఫెడరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ అత్యవసర సమావేశం నిర్వహించి, పలు కీలక అంశాలపై చర్చించింది. ఈ సమావేశంలో యూనియన్ ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని, జనరల్ సెక్రటరీ అమ్మీ రాజు, ట్రెజరర్ అలెక్స్ పాల్గొన్నారు. సమావేశం అనంతరం వారు ప్రెస్ మీట్‌లో మాట్లాడారు. ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని మాట్లాడుతూ, ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దగా గౌరవించే చిరంజీవి నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. “నిర్మాతలు బాగుండాలి, మేము కూడా బాగుండాలి. ఈ రోజు సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశించాము, కానీ అది జరగలేదు. మా ప్రధాన డిమాండ్ ఏమిటంటే, వేతనాల పెంపుదల జరిగిన వెంటనే ఆ రోజుకు ఆ రోజే చెల్లించాలి,” అని ఆయన అన్నారు.
READ MORE: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
అనిల్ వల్లభనేని మాట్లాడుతూ, నిర్మాతలతో జరిగిన చర్చల్లో కొన్ని అంశాలు అస్పష్టంగా ఉన్నాయని తెలిపారు. “నిర్మాతలు కొన్ని రూల్స్ చెప్పారు. వాటికి అంగీకరిస్తే మాకు సరే అని వారు అన్నారు. కానీ, వారు చెప్పిన కొన్ని విషయాలు మాకు అర్థం కాలేదు. కాల్‌షీట్స్, గంటల లెక్క, నాన్-మెంబర్స్, సండే లేదా హాలిడేలకు సంబంధించిన సింగిల్ కాల్‌షీట్స్ గురించి మాట్లాడారు. ఇవి స్పష్టంగా అర్థం కావడం లేదు,” అని ఆయన వివరించారు. నిర్మాతలు ఈ అంశాలపై స్పష్టత ఇవ్వాలని, రేపు ఉదయం మరోసారి చర్చలు జరిగితే సమస్యలు పరిష్కారమవుతాయని ఆశిస్తున్నామని అనిల్ తెలిపారు. “మేము అన్ని సంఘాలతో చర్చలు జరిపాము. రేపు ఉదయం నిర్మాతలు స్పష్టంగా వివరిస్తామని చెప్పారు. వివరంగా విన్న తర్వాతే మేము నిర్ణయం తీసుకుంటాము,” అని ఆయన అన్నారు.
READ MORE: Perni Nani: ఇల్లు అలకగానే పండగ కాదు..! రేపు జగన్ వస్తే మీకు ఏ ఖర్మ పడుతుందో ఆలోచించుకోండి..!
ఫిల్మ్ ఫెడరేషన్‌లో 24 శాఖలకు చెందిన 24 మంది ప్రతినిధులు ఉన్నారని, నిర్మాతలు కూడా బాగుండాలనే ఆలోచనతోనే తాము ముందుకు వెళ్తున్నామని అనిల్ స్పష్టం చేశారు. అయితే, నిర్మాత విశ్వ ప్రసాద్ చేసిన “స్కిల్స్ లేవు” అనే వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. “స్కిల్స్ లేకుండా ఇండస్ట్రీ ఇంత దూరం వచ్చేదా?,” అని ఆయన అన్నారు. సభ్యత్వ రుసుము విషయంపై కూడా ఆయన స్పందిస్తూ, “సభ్యత్వ రుసుము అనేది అంతర్గత వ్యవహారం. ఆ రుసుమును యూనియన్ సభ్యుల కోసం, వారి ఆపదలో ఖర్చు చేస్తాము,” అని వివరించారు. రేపు జరగబోయే చర్చల్లో సమస్యలు పరిష్కారమవుతాయని, ఇండస్ట్రీలో అందరూ కలిసి సామరస్యంగా పనిచేయాలని ఫిల్మ్ ఫెడరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ ఆకాంక్షిస్తోంది అని అన్నారు.
