Site icon NTV Telugu

Republic Day : ఢిల్లీ గణతంత్ర దినోత్సవ వేడుకలకు తెలంగాణ శకటం

Republic Day

Republic Day

దాదాపు మూడు సంవత్సరాల అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో న్యూఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకల్లో తెలంగాణా శకటం ప్రదర్శనకు చోటు దక్కింది. 2015, 2020 సంవత్సరాల అనంతరం ఈ సంవత్సరమే తెలంగాణా శకటానికి అవకాశం దక్కింది. ఈ సంవత్సరంతో పాటు వచ్చే మరో రెండేళ్ల పాటు కూడా తెలంగాణా శకటం ప్రదర్శనకు అనుమతి లభించింది. నిరంకుశ విధానాలు, రాజరిక, ఫ్యూడల్ వ్యవస్థలకు వ్యతిరేకంగా తెలంగాణాలో ఎన్నో ప్రజా ఉద్యమాలు వచ్చాయి.

దీనిలో భాగంగా కొమరం భీం, రాంజీ గోండు, చాకలి ఐలమ్మ తదితర పోరాట యోధులు ఎందరో నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా స్వయం పాలన, ప్రజాస్వామ్య పరిరక్షణకై తమ తమ పంథాలో పోరాటాన్ని చేశారు. ఈ స్వీయ పాలన, ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమ స్ఫూర్తిని మరోసారి ప్రపంచానికి తెలియ చేసే విధంగా రిప్రబ్లిక్ దినోత్సవ వేడుకలో ప్రదర్శనకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సలహాతో శకటాన్ని రూపొందించాం.

రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గార్ల తోడ్పాటుతో ఈ శకటం అతి స్వల్ప సమయంలో ఏర్పాటుకు మార్గం సులభమైనది. అట్టడుగు స్థాయిలో ప్రజాస్వామ్య కాంక్ష : తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధుల వారసత్వం – జయ జయహే తెలంగాణ

(ప్రజాస్వామ్య మట్టి పరిమళాలు – జన సామాన్య ప్రజాస్వామ్య యోధులు)

బ్రిటిష్ వలస పాలనలో జరిగిన ఆర్థిక, పరిపాలనా పరమైన దోపిడీ ప్రతి భారతీయుడి జీవితంపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపింది. ఈ చీకటి యుగంలో ఎదురైన చేదు అనుభవాల పాఠాలను సవాలుగా తీసుకొని బ్రిటీష్ బానిసత్వపు సంకెళ్లను తెంచి స్వాతంత్రం, సార్వభౌమాధికారం కోసం అనేక ఉద్యమాలకు దారితీశాయి.

తెలంగాణ లోనూ కొమరంభీం, రాంజీ గోండ్, చాకలి ఐలమ్మగా పిలుచుకొనే చిట్యాల ఐలమ్మ వంటి సాధారణ వ్యక్తుల వీరోచితమైన పోరాటాలు ఈ ప్రాంత సామాన్య ప్రజల జీవితాలపై అత్యంత ప్రభావాన్ని చూపాయి. వీరి పోరాటాలు జానపద కళలు, సాహిత్యంలోనూ ప్రతిబింబించాయి.

20వ శతాబ్దం ప్రారంభంలో ఈ విప్లవకారులు స్వయం పాలన, ప్రజల ప్రజాస్వామ్య (లోక్ తంత్ర) పునరుద్ధరణ, మా భూమిలో మా రాజ్యం అంటూ చేసిన వీరోచిత పోరాటాలు ఇక్కడి పౌర సమాజానికి ఒక అద్భుతమైన ప్రజాస్వామ్య పోరాట వారసత్వాన్ని అందించింది.

ఆదివాసీ గిరిజనుల స్వేచ్ఛ, గౌరవం, హక్కుల కోసం కొమరంభీం, రాంజీ గోండ్‌లు పోరాటాలు చేశారు. వారి లక్ష్య సాధన కోసం జరిపిన పోరాట స్ఫూర్తిని సమాజంలో కల్పించడానికి తమదైన పద్ధతుల్లో గెరిల్లా యుద్ధ వ్యూహాలను అవలంబించారు, “జల్, జంగల్, జమీన్” (నీరు, అటవీ, భూమి) అనే నినాదాలతో పోరాటాలు చేశారు.

రైతులు, రైతు కూలీల పై భూస్వాములు చేసిన దోపిడీ కి వ్యతిరేకంగా చాకలి ఐలమ్మగా పిలువబడే చిట్యాల ఐలమ్మ చేసిన పోరాటం అమోఘమైనది. అచంచల సంకల్పంతో, అట్టడుగు వర్గాల తోడ్పాటుతో భూస్వాములను ఎదుర్కొనడం ద్వారా సామాన్య గ్రామీణులలో అవసరమైన ధైర్యాన్ని కల్పించింది.

మహిళా సాధికారత, ఆత్మ విశ్వాసం, ధైర్యానికి ప్రతిరూపంగా చిట్యాల ఐలమ్మ నిలిచింది.
ఈ వీరోచిత పోరాట యోధుల త్యాగాలు నేటి సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలిచాయి. ప్రస్తుత సమాజంలో అట్టడుగు వర్గాల హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య విలువలు పెంపొందించేందుకు, అందరికి సమ న్యాయం అందేందుకు ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటాలు పునాదులు వేసాయి. సామాజిక, ఆర్థిక న్యాయం, గౌరవనీయమైన జీవనం, అవకాశాల కల్పన, వ్యక్తిగత గౌరవాలు పెంపొందించేలా చేశాయి.

సమకాలీన కాలంలో ప్రజా సమస్యల పరిష్కారానికి, గ్రామసభలు, గ్రామ పంచాయితీల ఏర్పాటుకు దారితీసింది. గిరిజనులకు అధికారాలను అందించింది. “జల్, జంగల్ జమీన్” నినాదం ద్వారా అట్టడుగు వర్గాల భూములకు రక్షణ కల్పించడం జరిగింది. ఈ స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తి అట్టడుగు వర్గాల్లో ప్రజాస్వామ్య విలువలను కొనసాగించేలా తెలంగాణా ప్రభుత్వ నిబద్ధతకు ఈ శకటం స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.

Exit mobile version