తెలంగాణలోని అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఆహార భద్రత కల్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని వేగవంతం చేసింది. ఇందులో భాగంగా సూర్యాపేట జిల్లాలోని అర్హులైన ప్రతి కుటుంబానికీ రాబోయే 15 రోజుల్లో కొత్త రేషన్ కార్డుల పంపిణీ పూర్తి చేస్తామని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. పౌర సరఫరాల శాఖను నేరుగా ప్రజల చెంతకు చేర్చాలనే తపనతోనే ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోంది.
గతంలో ఇచ్చిన దొడ్డు బియ్యాన్ని తినలేక రీసైక్లింగ్‌కు తరలించే దుస్థితి ఉండేదని, దానిని మారుస్తూ దేశంలోనే తొలిసారిగా తెల్ల రేషన్ కార్డుదారులందరికీ ఉచితంగా నాణ్యమైన సన్న బియ్యం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3.42 కోట్ల మంది పేదలు లబ్ధి పొందుతున్నారు.
గత పదేళ్లలో రేషన్ కార్డులు అందక ఇబ్బంది పడిన వారికి ఉపశమనం కలిగిస్తూ.. ప్రభుత్వం కొత్తగా 16 లక్షల కుటుంబాలను రేషన్ పరిధిలోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1.06 కోట్ల కుటుంబాలకు ఈ స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా ఆహార భద్రత అందుతోంది. ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు వంటి సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు కావడానికి కూడా ఈ కార్డులు ఎంతో కీలకం కానున్నాయి. సూర్యాపేట జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని అర్హులకు స్మార్ట్ కార్డులతో పాటు ఉద్యోగుల పిల్లలకు కారుణ్య నియామక పత్రాలను అందజేశారు.

