Karimnagar: కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. దాచారం గ్రామంలో పురుగుల మందు తాగి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలో వడ్లకొండ శ్రీహర్ష, రుక్మిణి దంపతులు మృతి చెందారు. బెజ్జంకి కేంద్రంగా వస్త్ర దుకాణం నిర్వహిస్తున్న శ్రీహర్ష అప్పుల బాధతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైనట్లు సమాచారం. వ్యాపార అవసరాల కోసం అనిల్ అనే వ్యక్తికి లక్షల రూపాయల మేర అప్పు ఇప్పించడంతో పాటు, అభిషేక్, రాజశేఖర్, భూపతిరెడ్డి, శ్రీనివాస్ నుంచి కూడా డబ్బులు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ అభిలాష్, భూపతిరెడ్డి శ్రీహర్షను తరచూ బెదిరించడంతో అతడు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ ఒత్తిడిని తట్టుకోలేక శ్రీహర్ష, రుక్మిణి దంపతులు కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారని సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి అప్పుల వ్యవహారం, బెదిరింపులపై విచారణ చేపట్టారు. ఈ ఘటనతో దాచారం గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
READ MORE: Visakhapatnam: గ్రేటర్ విశాఖ కార్పొరేటర్ల పార్టీ ఫిరాయింపులో కీలక పరిణామం..
