Ration Card eKYC: మీరు ఈకేవైసీ పూర్తి చేశారా..? స్టేటస్‌ను సింపుల్‌గా తెలుసుకోండిలా..

Ration Cardsssss

Ration Cardsssss

తెలంగాణలో ఉచిత రేషన్ బియ్యం పొందుతున్న లబ్ధిదారులకు ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను తప్పనిసరి చేశారు. పంపిణీ వ్యవస్థలో పారదర్శకత పెంచడం, అర్హులైన వారికి మాత్రమే సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 31 నాటికి రేషన్ కార్డులోని సభ్యులందరూ ఈ-కేవైసీని పూర్తి చేయాల్సి ఉంటుంది. గడువులోగా ఈ ప్రక్రియ ముగించకపోతే కార్డు నుంచి సభ్యుల పేర్లు తొలగించే అవకాశం ఉంది. దీనివల్ల ఉచిత రేషన్‌తో పాటు రేషన్ కార్డు ఆధారంగా వచ్చే ఇతర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను కూడా కోల్పోవాల్సి వస్తుంది.

లబ్ధిదారులు తమ ఈ-కేవైసీ పూర్తయిందో లేదో తెలుసుకోవడానికి ఎక్కడికీ వెళ్లాల్సిన పనిలేదు. స్మార్ట్‌ఫోన్ ద్వారానే సులభంగా స్టేటస్ పరిశీలించుకోవచ్చు. ముందుగా అధికారిక ‘స్మార్ట్ పీడీఎస్’ (smartpds.telangana.gov.in) పోర్టల్‌ను సందర్శించి, బెనిఫిషియరీ డీటైల్స్ విభాగంలో రేషన్ కార్డ్ నంబర్, క్యాప్చా నమోదు చేయాలి. అక్కడ వివరాలలో స్టేటస్ ‘యాక్టివ్’ అని ఉంటే కేవైసీ పూర్తయినట్లు కాదు. దాంతో పాటు.. లాస్ట్ ఆప్షన్ లో ఉన్న వెరిఫికేషన్ స్టేటస్ దగ్గర కచ్చితంగా వెరిఫైడ్ అని ఉండాలి లేదంటే మీ కేవైసీ పూర్తి కానట్లే.

ఒకవేళ కేవైసీ నాట్ వెరిఫైడ్ లో ఉంటే, వెంటనే స్థానిక రేషన్ దుకాణానికి వెళ్లి ఈ-పోస్ యంత్రంలో బయోమెట్రిక్ వేలిముద్రలు లేదా ఐరిస్ స్కాన్ ద్వారా పూర్తి చేసుకోవచ్చు. మీసేవా కేంద్రాలలో కూడా ఈ సదుపాయం అందుబాటులో ఉంది. ఈ నమోదు ప్రక్రియ పూర్తిగా ఉచితం కాబట్టి లబ్ధిదారులు రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. దీని కోసం రేషన్ కార్డుతో పాటు సభ్యుల ఒరిజినల్ ఆధార్ కార్డులను వెంట తీసుకెళ్లాలి.