Telangana Rain Alert: తెలంగాణలో నిన్న రాత్రి వర్షం కుమ్మేసింది. హైదరాబాద్‌లో రోడ్లు నీట మునిగాయి. మండే ఎండలతో ఇబ్బంది పడిన జనాలకు కొంత ఊరట లభించింది. అయితే.. వాతావరణ శాఖ మరో చల్లటి కబురు చెప్పింది. కర్ణాటక, తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు ద్రోణి ఏర్పడిందని దీంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నట్లు తెలిపింది. రానున్న నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌తో పాటు రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, ఉరుములు, మెరుపుతో కూడిన వర్షం కురుస్తుందని వెల్లడించింది. మరోవైపు.. హైదరాబాద్‌లో నేటి ఉదయం (బుధవారం)నుంచే నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే ఎడతెరిపి లేకుండా రాత్రి నుంచి వర్షం పడుతూనే ఉంది.
READ MORE: Parents Smoking: తల్లితండ్రుల అలవాట్లు పిల్లల ఆరోగ్యంపై ప్రభావం.. కొత్త అధ్యనంలో షాకింగ్ విషయాలు..!
ఈ నేపథ్యంలో ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి.. అత్యవసరమైతే తప్పా బయటకు వెళ్లకండి. నీటితో నిండిన రహదారులు, వంతెనలు దాటేందుకు ప్రయత్నించవద్దు. విద్యుత్ తీగలు, పోల్‌లు తాకరాదు, వాటికి దగ్గరగా కూడా వెళ్లవద్దు. ఇళ్ల చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజ్ సదుపాయాలను శుభ్రం చేసుకోండి. చిన్న పిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లకుండా జాగ్రత్తపడండి. నదులు, వాగులు పొంగిపొర్లే అవకాశం ఉన్నందున తీర ప్రాంతాల వద్దకు వెళ్లకండి. వరద నీరు ఇళ్లలోకి చేరే అవకాశం ఉంటే, ముందుగానే సురక్షిత ప్రదేశాలకు తరలించండి. పశువులను ఎత్తైన ప్రదేశాలకు తరలించండి. పిడుగు సమయంలో చెట్ల కింద లేదా ఓపెన్ ప్రదేశాల్లో నిలబడి ఉండవద్దు. మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్, టీవీ వంటి ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగాన్ని ఆపండి. పిడుగు సమయంలో నీటిలో ఉండవద్దు చేపలు పట్టడం లేదా స్నానం చేయడం మానుకోండి.
