Telangana Rains: తెలంగాణలో అకాల వర్షాల మోత.. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ.!

Nellore Rains

Nellore Rains

Telangana Rains: తెలంగాణలో ఒకవైపు మండుతున్న ఎండలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా.. మరోవైపు అకాల వర్షాలు రాష్ట్రాన్ని చల్లబరుస్తున్నాయి. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. అర్ధరాత్రి నుంచి ప్రారంభమైన వర్షం నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రజలకు ఉపశమనం కలిగించింది.

హైదరాబాద్ నగరంలోని మాదాపూర్‌, బంజారాహిల్స్‌, లింగంపల్లి, గచ్చిబౌలి, కుత్బుల్లాపూర్‌, మియాపూర్‌, చందానగర్‌, రాయదుర్గం, కూకట్‌పల్లి, నిజాంపేట, బాచుపల్లి, ఖైరతాబాద్‌, ఎల్‌బీనగర్‌, ఉప్పల్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌ వంటి ప్రాంతాల్లో, దాదాపు నగరం మొత్తం వర్షం కురిసింది. కొన్ని చోట్ల వర్షానికి రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు నగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు నమోదయ్యాయి.

సిద్దిపేట జిల్లా ముత్స్యాలలో అత్యధికంగా 12.3cm వర్షపాతం నమోదైంది. అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలుచోట్ల రహదారులపై నీరు నిలవడంతో రవాణాకు కూడా అంతరాయం ఏర్పడింది. మరోవైపు రాష్ట్రంలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నాగర్‌కర్నూల్‌, నల్గొండ‌, నిజామాబాద్‌, రాజన్న సిరిసిల్ల‌, సిద్దిపేట‌, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్‌, జనగాం, కామారెడ్డి, యాదాద్రి భువనగిరి, జోగులాంబ గద్వాల్‌, మహబూబ్‌నగర్‌, నారాయణపేట‌, రంగారెడ్డి‌, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబాబాద్‌, మెదక్‌, మేడ్చల్ మల్కాజిగిరి, సూర్యాపేట‌, వరంగల్ హన్మకొండ‌, సంగారెడ్డి‌, వికారాబాద్‌, వనపర్తి జిల్లాల్లో వచ్చే 2-3 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే గంటకు 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.