Telangana Public School: ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ ప్రారంభించనున్న సీఎం.!

Telangana Public School

Telangana Public School

Telangana Public School: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సరికొత్త విద్యా విధానంలో భాగంగా రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలో నిర్మించిన ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్(Telangana Public School)’ (TPS) పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభానికి సిద్ధమైంది. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి మౌలిక వసతులతో ఉచితంగా నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యంగా ఈ నూతన విధానాన్ని తీసుకువచ్చారు. సకల సౌకర్యాలతో ముస్తాబైన ఈ పాఠశాల భవనాన్ని నేడు (జూన్ 17)న సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభించనున్నారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులతో కలిసి అల్పాహారం (బ్రేక్ ఫాస్ట్) చేయనున్నారు. అనంతరం స్కూల్లో ఏర్పాటు చేసిన క్రీడాప్రాంగణం, ఆధునిక కంప్యూటర్ ల్యాబ్ తదితర సౌకర్యాలను పరిశీలించి, సమీపంలోని మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సీఎం పర్యటన నేపథ్యంలో సోమవారం కలెక్టర్ నారాయణరెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, సీపీ తరుణ్ జోషి, విద్యాకమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి పాఠశాలను సందర్శించి భద్రత, మౌలిక వసతుల ఏర్పాట్లను పర్యవేక్షించారు.

×
×
Ad

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆరుట్ల నుంచే ఈ సరికొత్త విద్యా విప్లవానికి శ్రీకారం చుట్టామని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. ఒకప్పుడు ప్రభుత్వ బడులను చిన్నచూపు చూసిన వారే, నేడు తమ పిల్లల అడ్మిషన్ల కోసం పోటీ పడేలా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పాఠశాలలను తీర్చిదిద్దిందని ఆయన అన్నారు. రానున్న రోజుల్లో విద్యార్థులందరికీ అత్యుత్తమ విద్యను అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఇదే తరహా మోడల్ పాఠశాలలను నిర్మిస్తామని విద్యాకమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి స్పష్టం చేశారు.