DGP CV Anand: నిరంతర విధులు, పని ఒత్తిడి కారణంగా పోలీసులు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపే అవకాశం చాలా తక్కువగా ఉంటు0ది. పోలీసు సిబ్బంది ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజానికి మరింత మెరుగైన సేవలు అందించగలరని డిజిపి సి.వి. ఆనంద్ స్పష్టం చేశారు. పోలీసుల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా ‘ఫిట్ కాప్’ (Fit Cop) రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటుకు హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్, ఇతర సంస్థల సహకారంతో రూపొందించినట్టుగా శుక్ర వారం డిజిపి కార్యాలయంలో ఫౌండేషన్ సభ్యులు ఇతర పోలీసు అధికారులతో సమావేశంలో డిజిపి పేర్కొన్నారు. పోలీస్ హెల్త్ మేనేజ్మెంట్ ప్రొఫైల్ సిస్టమ్‌గా రూపొందించిన ఈ విధానం ప్రత్యేక యాప్ ఆధారంగా రూపొందించారు.
ఈ కార్యక్రమాన్ని 30-45 అమలు చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఈ యాప్ లో ఎనిమిది ప్రధాన ఆరోగ్య అంశాలకు సంబంధించిన ప్రశ్నలతో పాటు వ్యక్తిగత ఆరోగ్య సమాచారాన్ని నమోదు చేసే అవకాశం కల్పించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 90 వేల మందికి పైగా పోలీసు సిబ్బంది తమ సెల్‌ఫోన్ నంబరు ఆధారంగా వివరాలు నమోదు చేసుకోవచ్చు. మధుమేహం, రక్తపోటు, బాడీ మాస్ ఇండెక్స్, ఇతర ఆరోగ్య సమస్యలు, జీవనశైలి అలవాట్లు, శారీరక శ్రమ, ధూమపానం, మద్యపానం వంటి అంశాలపై సమాచారం సేకరిస్తారు. ఈ వివరాల ఆధారంగా సిబ్బందిని తక్కువ, మధ్యస్థ, అధిక ఆరోగ్య ముప్పు విభాగాలుగా గుర్తిస్తారు.
ఆరోగ్య ప్రమాద స్థాయిని బట్టి కాల్‌సెంటర్ ద్వారా సంబంధిత సిబ్బందికి ఫోన్ ద్వారా అప్రమత్తం చేస్తామని హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ ఫౌండర్ సల్మాన్ వివరించారు. అవసరమైన వారికి వైద్య పరీక్షలు, ఆసుపత్రుల ద్వారా చికిత్స, ఆరోగ్య సలహాలు, కౌన్సెలింగ్ అందించేలా చర్యలు తీసుకుంటారు. కిడ్నీ సంబంధిత సమస్యలు, మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధుల ముప్పును ముందుగానే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకునేలా ఈ విధానం ఉపయోగపడుతుందని డిజిపి వివరించారు.
సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యం ..
పోలీసు సిబ్బందిలో ఆరోగ్యంపై అవగాహన పెంచడంతో పాటు వ్యాధులు ప్రమాదకారంగా మారకముందే నివారణ చర్యలు చేపట్టడం ఫిట్ కాప్ ప్రధాన ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని అన్ని పోలీసు విభాగాల్లో సమర్థంగా అమలు చేయనున్నారు. ప్రతి పోలీసు ఉద్యోగి ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో ఫిట్ కాప్ కీలకంగా నిలుస్తుందని డిజిపి సి. వి. ఆనంద్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనర్ సజ్జనార్, ఎడిజి అకున్ సబర్వాల్, ఐజీపీ, పి & ఎల్ గజరావు భూపాల్, భద్రత అండ్ ఆరోగ్య భద్రత సెక్రెటరీ ఉదయ్ కుమార్ రెడ్డి (రిటైర్డ్), టి స్పార్క్ ఎస్పీ రూపేష్, ఎస్పీ అవినాష్ , ఇతర పోలీసు అధికారులు, హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్, ఇతర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

