TG Local Body Elections: తెలంగాణ పల్లెల్లో ప్రజాస్వామ్య ఎన్నికల సందడి మొదలైంది. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కావడంతో రాష్ట్రం మొత్తం ఎన్నికల వాతావరణంలోకి ప్రవేశించింది. జిల్లాల వారీగా ఎన్నికల యంత్రాంగం ఇప్పటికే సిద్ధమవ్వగా, తొలి దశకు సంబంధించిన నోటిఫికేషన్లు గురువారం విడుదల కానున్నాయి. దీనితో సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నేటితో ప్రారంభమవుతుంది. 30న నామినేషన్ల పరిశీలన, సాయం త్రం బరిలో నిలిచిన అభ్యర్థులతో కూడిన తుది జాబితాను ప్రకటించనున్నారు.
READ MORE: CM Chandrababu: రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై సీఎం కీలక ఆదేశాలు
రాష్ట్రవ్యాప్తంగా వేలాది గ్రామాల్లో ప్రజలు తమ స్థానిక నాయకులను ఎన్నుకునేందుకు మరోసారి సిద్ధమవుతున్నారు. మొదటి విడతలోనే 189 మండలాల్లో 4,236 సర్పంచ్ స్థానాలు, దాదాపు 37 వేల వార్డులకు సంబంధించి ఎన్నికల జరగనున్నాయి. పలు చోట్ల అభ్యర్థుల ఎంపికపై గ్రామ పెద్దలతో చర్చలు సాగుతుండగా, మరికొన్ని పంచాయతీల్లో ఇప్పటికే ఒప్పందాలు కుదిరినట్లుగా సమాచారం. నామినేషన్‌ల స్వీకరణ నుంచి తుది జాబితా విడుదల వరకు మొత్తం ప్రక్రియను అత్యంత జాగ్రత్తగా చేపట్టేందుకు కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లు సమావేశాల్లో మార్గదర్శకాలు అందుకున్నారు. పోలింగ్ సిబ్బంది శిక్షణ నుంచి భద్రతా ఏర్పాట్ల వరకు ప్రతిదీ ముందుగా ప్లాన్ చేశారు. ఓటర్ల సౌలభ్యం కోసం తొలి విడతకు సంబంధించిన గ్రామాల్లో ఫొటోతో కూడిన ఓటర్ల జాబితాలు సైతం ప్రదర్శించనున్నారు. కాగా.. పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో పూర్తికానున్నాయి. మొదటి విడత పోలింగ్ డిసెంబర్ 11న జరుగుతుంది. ఉదయం నుంచే ఓటింగ్ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం తర్వాత లెక్కింపు చేపట్టి అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. ఫలితాల అనంతరం ఉప సర్పంచి ఎన్నిక కూడా అదే రోజు పూర్తి చేయనున్నారు.
