Site icon NTV Telugu

Municipal Elections Nominations: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా.. నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ!

Municipal Elections Nominations

Municipal Elections Nominations

Municipal Elections Nominations: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగింది. వచ్చే నెలలో ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 11న పోలింగ్, 13న కౌంటింగ్ జరగనుంది. 16వ తేదీన మేయర్లు, ఛైర్మన్ల ఎన్నిక జరుగుతుంది. నోటిఫికేషన్ విడుదలతోనే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసింది. పురపోరు కోసం మూడు ప్రధాన పార్టీలు పోటాపోటీగా సిద్ధమవుతున్నాయి. పంచాయతీ ఎన్నికల ఫలితాలు కంటిన్యూ చేయాలని కాంగ్రెస్.. సత్తా చాటాలని బీఆర్ఎస్.. పట్టణ ప్రాంతాలపై పట్టు నిరూపించుకోవాలని బీజేపీ చూస్తున్నాయి.

తెలంగాణలో మరోసారి ఎన్నికల హీట్ పెరగనుంది. ఇప్పటికే జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించగా.. హోరాహోరీగా సాగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు పొందిన అభ్యర్థులు అధిక సంఖ్యలో గెలిచి తొలి స్థానంలో నిలవగా.. బీఆర్ఎస్ రెండో స్థానం, బీజేపీ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. కాగా గ్రామ స్థాయిలో ప్రశాంతంగా ముగిసిన ఈ ఎన్నికల తర్వాత ఇప్పుడు పట్టణ రాజకీయాలకు తెరలేచే సమయం వచ్చింది.

IND vs NZ 4th T20: నేడు విశాఖలో నాలుగో టీ20.. సంజు శాంసన్‌ సంగతి ఏంటి?

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఇందుకు సంబంధించి నేటి నుంచి నామినేషన్ల స్వీకరణమొదలు కానుంది. ఫిబ్రవరి 11వ తేదీన ఓటింగ్ జరగనుంది. 13వ తేదీ ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ఉంటుంది. నేటి నుంచి ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అవుతుంది. జనవరి 30 నామినేషన్లకు చివరి తేదీ. జనవరి 31న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఫిబ్రవరి 1న స్క్రుటినీపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఫిబ్రవరి 2న అభ్యంతరాలపై తుది నిర్ణయం తీసుకుంటారు. ఫిబ్రవరి 3 నామినేషన్లకు ఉపసంహరణకు చివరి తేదీ. అదే రోజున ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు.

ఈ ఎన్నికలల్లో మొత్తం 52 లక్షల 43 వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో పురుషులు 25.62లక్షలు కాగా.. మహిళలు 26.80లక్షలు ఉన్నారు. ఫిబ్రవరి 16న మేయర్, డిప్యూటీ మేయర్, ఛైర్మన్, వైస్‌ఛైర్మన్ ఎన్నిక జరుగుతుంది. దీంతో రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగిసినట్టవుతుంది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 2,996 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకోసం 8,203 పోలింగ్‌ కేంద్రాలు, 136 కౌంటింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేశారు.

Seetha Ramam Part 2: సీతారామం-2 షురూ.. సీక్వెల్‌పై అప్‌డేట్ వైరల్!

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. కరీంనగర్, మంచిర్యాల, నిజామాబాద్, కొత్తగూడెం, నల్గొండ, మహబూబ్‌నగర్, రామగుండం వంటి ప్రధాన కార్పొరేషన్లలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొనే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించే వారికి అధికారులు కీలక అలర్ట్ జారీ చేశారు. ఆస్తి పన్ను బకాయిలు చెల్లిస్తేనే.. నామినేషన్‌ వేయడానికి అవకాశం కల్పిస్తామని అధికారులు స్పష్టం చేశారు. దీంతో బకాయిలు ఉన్నవారు చెల్లింపులకు పరుగులు తీస్తున్నారు.

ఇప్పటికే రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్‌‌లకు సంబంధించిన రిజర్వేషన్లు పురపాలక శాఖ ఖరారు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 121 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డులు, చైర్‌పర్సన్, మేయర్‌ పదవులకు సంబంధించిన రిజర్వేషన్లను ఖరారు చేస్తూ గతంలోనే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు, అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీలకు సీట్ల కేటాయింపునకు మార్గదర్శకాలను కూడా ప్రకటించింది.

మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్ల పరిమితి 50 శాతానికి మించరాదని తెలిపింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్‌ విభాగాల్లోని మొత్తం సీట్లలో 50 శాతం మహిళలకు కేటాయించాలని స్పష్టం చేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీ కోటాలు.. డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా బీసీల కోటా, తెలంగాణ రాష్ట్ర మునిసిపాలిటీల చట్టం, 2019 ప్రకారం మహిళలకు 50 శాతం రిజర్వేషన్ల కేటాయింపులు జరిగాయి.

Without Ticket Flight Journey: మనవడికి టికెట్ తీసుకోకుండా ఫ్లైట్ ఎక్కించిన బామ్మ.. చివరికి.?

10 మున్సిపల్ కార్పొరేషన్‌ మేయర్ పీఠాలకు సంబంధించి ఎస్సీలకు ఒకటి, ఎస్టీలకు ఒకటి, బీసీలకు మూడు , అన్‌రిజర్వుడు కోటాలో 5 ఖరారు చేశారు. అలాగే 121 మున్సిపాలిటీలలో ఎస్టీలకు 5, ఎస్సీలకు 17, బీసీలకు 38 , అన్‌రిజర్వ్‌డ్‌లో 61 మున్సిపాలిటీలను కేటాయించారు. అలాగే ప్రతి మున్సిపాలిటీలో మొత్తం వార్డుల సంఖ్య ఖరారు చేయడమే కాకుండా… ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా, అన్‌రిజర్వ్డ్ సీట్ల కోటాకు సంబంధించి స్పష్టమైన విభజన చేసింది. కొన్ని పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు చట్టపరమైన, పరిపాలనా సమస్యల కారణంగా నిలిచిపోయాయి.

Exit mobile version