Srikantha Chari Death Anniversary: ఆదిలాబాద్ అడవుల నుంచి.. ఖమ్మం గుమ్మం దాకా.. పాలమూరు పల్లెల నుంచి.. మెతుకుసీమ గడపల దాకా.. ఓరుగల్లు కోటల నుంచి.. హైదరాబాద్ గల్లీల దాకా.. ఇందూరు, కరీంనగర్, నల్లగొండ, రంగారెడ్డి.. ఊరూవాడా.. కలబడి నిలబడితే వచ్చిందీ తెలంగాణ. తెలంగాణ పోరాటాల ఖార్ఖానా. ఒక్కరా.. ఇద్దరా.. వందలు వేలమంది చావును ముద్దాడుతూ.. వదిలిన ఊపిరే ఈ తెలంగాణ. అలా రాష్ట్ర సాధనకు ప్రాణాలు అర్పించిన మలిదశ తెలంగాణ ఉద్యమ కారుడు శ్రీకాంతా చారి వర్ధంతి నేడు. ఆ మహనీయుడు, పోరాట యోధుడి గురించి తెలుసుకుందాం..
READ MORE: Mohanlal: ‘దృశ్యం 3’ పూర్తి చేసిన మోహన్ లాల్ .. ఇప్పుడు మరో పార్ట్ 2 లోకి ఎంట్రీ!
స్వాతంత్ర్య దినోత్సవం నాడు జన్మించిన సాధారణ గ్రామీణ బాలుడు ఒక రోజున లక్షల మందికి స్ఫూర్తిగా మారతాడని అప్పుడు ఎవరూ ఊహించలేదు. చిన్నప్పటి నుంచే అతనిలో కనిపించిన నిష్కామ సేవ భావన, పక్కింటి కష్టాన్ని కూడా తనదిగా భావించే స్వభావం, సమాజంపై అపారమైన ప్రేమ.. ఇవన్నీ కలసి అతడిని సాధారణ యువకుడిగా కాదు, ఒక ఉద్యమ శిఖరాగ్నిగా తీర్చిదిద్దాయి. ఉన్నత విద్య కోసం నగరానికి వచ్చిన తర్వాత అతడి ఆలోచన మరింత పదిలమైంది. పుస్తకాల్లో చదివిన విప్లవ వీరులు, వీధిలో చూసిన అసమానతలు, తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్న అన్యాయం.. ఇవన్నీ కలిసి ఆ యువ కెరటం మనసులో ఒక మౌన పద్యంలా తపించాయి. ‘మనకు మన పాలన కావాలి’ అనే భావం ఏర్పడేలా చేశాయి. ఆ యువకుడు ఎవరో కాదు.. మలిదశ ఉద్యమకారుడు శ్రీకాంత చారి..
కరకర పొడిచే పొద్దును చీల్చుకుంటూ కాసోజు వెంకటాచారి, శంకరమ్మ దంపతుల పెద్ద కొడుకుగా 1986 ఆగస్టు 15న శ్రీకాంతాచారి జన్మించాడు. ఉమ్మడి నల్గొండ జిల్లా మోత్కూరు మండలం పొడిచేడు గ్రామానికి చెందిన వీరిది మధ్యతరగతి కుటుంబం. శ్రీకాంతాచారికి రవీంద్రాచారి అనే తమ్ముడు ఉన్నాడు. తండ్రి వెంకటాచారి వ్యవసాయంతో పాటు వృత్తి పనులు చేసేవాడు. శ్రీకాంతాచారి అందరి పిల్లల లెక్కనే ఆడుతూ పాడుతూ ఎగురుతూ, దునుకుతూ మస్తు హుషారుగా ఉండేటోడు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున పుట్టడంతో దోస్తులందరూ ‘నువ్వు అదృష్టవంతుడివి’ అనేవారు. ఆ రోజు ప్రత్యేకత తెలుసుకునే సందర్భంలో శ్రీకాంతాచారి భగత్ సింగ్, అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్ ఇలా ఎందరో యోధుల చరిత్ర చదివి స్ఫూర్తి పొందాడు. ఎవరు సాయం కావాలన్నా కాదనేవాడు కాదు. సమాజం హితం కోసం తపించేవాడు. దాచుకున్న డబ్బును పేదలు, స్నేహితుల కోసం ఖర్చు చేసేవాడు.
READ MORE: Devara 2 : ‘దేవర: పార్ట్ 2’ ప్రాజెక్ట్ నిలిపివేత? ఫ్యాన్స్‌లో టెన్షన్.. పూర్తి వివరాలు ఇవే!
ప్రాథమిక విద్యను మోత్కూరు, నకిరేకల్ గ్రామాలలో అభ్యసించిన శ్రీకాంత్ ఉన్నత చదువుల కోసం హైదరాబాద్‌కు వెళ్లాడు. ఈ క్రమంలోనే తెలంగాణ స్థితిగతులను అధ్యయనం చేశాడు. అప్పుడప్పుడే స్వరాష్ట్ర ఆకాంక్ష మలిదశ ఉద్యమం ప్రతి బిడ్డకు చేరుతున్న రోజులు. 2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ దీక్షకు దిగుతున్నట్లు మీడియా ద్వారా చెప్పారు. కరీంనగర్ నుంచి సిద్దిపేట దీక్ష స్థలికి పోతుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో తెలంగాణ అంతటా ఆందోళనలు, ఉద్యమాలు, నినాదాలతో రాష్ట్రం మార్మోగింది. నిరసనలు ఉద్ధృతమయ్యాయి. తెలంగాణ ఉద్యమకారులపై ప్రభుత్వం అణచివేత కొనసాగించడం ప్రారంభించింది. ఉద్యమకారులపై లాఠీ దెబ్బలు అరెస్టులను చూసి శ్రీకాంత్ తట్టుకోలేకపోయాడు. ఆ ఉద్వేగంతో, మరుగుతున్న రక్తంతో కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో తన చావుతోనైనా ఈ ప్రభుత్వంలో చలనం తెవాలనుకున్నడు. తన శరీరంలో అణువణువు తెలంగాణ కోసం తపించే శ్రీకాంతాచారి హైదరాబాద్ ఎల్బీనగర్ సర్కిల్‌లో కేసీఆర్ అరెస్టుకు నిరసనగా జరిగిన ధర్నాలో పాల్గొన్న శ్రీకాంత్ ఒంటిమీద పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నడు. అగ్నికి ఆహుతి అవుతూనే ‘జై తెలంగాణ” అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదించాడు. న్యాయం చేయమంటూ అంబేద్కర్ విగ్రహాన్ని కాలిన గాయాలతో వేడుకున్నడు. పోలీసులు, ఉద్యమకారులు వెంటనే మంటలు ఆర్పే ప్రయత్నం చేసి కామినేని హాస్పిటల్‌కు, అనంతరం యశోదకు తరలించారు. రెండు రోజుల తర్వాత ఉస్మానియాకు తీసుకెళ్లారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డిసెంబర్ మూడున శ్రీకాంతాచారి అమరుడయ్యాడు. ‘నేను చచ్చినా తెలంగాణ రాకపోతే మళ్లీ జన్మించి మళ్లీ మళ్లీ ప్రాణత్యాగం చేస్తా’ అని పిడికిలి బిగించి కన్నుమూశాడు.
