తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తప్పదని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు అర్థమైందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు. అధికార పార్టీ (కాంగ్రెస్) తమ ఎమ్మెల్సీ అభ్యర్థులను అరువు తెచ్చుకుందని, 10 ఏళ్లు అధికారంలో ఉన్న పార్టీ (బీఆర్ఎస్)కి బరిలో నిలబడే అభ్యర్థులు కరువయ్యారని సెటైర్లు విసిరారు. బీఆర్ఎస్ హయంలో రాష్ట్రం దివాలా తీస్తే.. కాంగ్రెస్ పాలనలో ముఖ్యమంత్రి అప్పుల కోసం కేంద్రం చుట్టూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావడం ఖాయం అని ఎంపీ లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు.
నల్లగొండ బీజేపీ కార్యాలయంలో ఎంపీ లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ… ‘తాజా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే ఎన్నికలు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తప్పదని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు తేలిపోయింది. అధికార పార్టీ తమ ఎమ్మెల్సీ అభ్యర్థులను అరువు తెచ్చుకుంది. 10 ఏళ్లు అధికారంలో ఉన్న పార్టీకీ బరిలో నిలబడే అభ్యర్థులు కరువయ్యారు. బీఆర్ఎస్ హయంలో రాష్ట్రం దివాలా తీస్తే.. కాంగ్రెస్ పాలనలో ముఖ్యమంత్రి అప్పుల కోసం కేంద్రం చుట్టూ తిరుగుతున్నారు’ అని అన్నారు.
Also Read: DK Aruna: తెలంగాణలో బీజేపీ జెండా ఎగరడం ఖాయం!
‘ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావడం ఖాయం. రాష్ట్రంలో ప్రభుత్వం అభద్రతతోనే పాలన కొనసాగిస్తుంది. పార్టీ ఫిరాయింపులు రాష్ట్రంలో ప్రభుత్వానికి గుదిబండగా మారనున్నాయి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు సెమీ ఫైనల్ ఎన్నికలు’ అని ఎంపీ లక్ష్మణ్ చెప్పుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా నేతలు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా ఉన్నారు.