Site icon NTV Telugu

DGP Shivadhar Reddy : 11 నెలలో 465 మంది మావోయిస్టులు లొంగిపోయారు

Dgp

Dgp

DGP Shivadhar Reddy : తెలంగాణలో మావోయిస్టు కార్యకలాపాలను అణిచివేయడానికి ప్రభుత్వం చేపట్టిన కఠిన చర్యలు, నిరంతర ఆపరేషన్లు వేగంగా ఫలితాలు ఇస్తున్నాయి. తాజాగా మరో భారీ లొంగుబాటు చోటుచేసుకుంది. మొత్తం 37 మంది మావోయిస్టులు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా డీజీపీ వివరాలను వెల్లడించారు.

డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ.. పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా సీఎం చేసిన పిలుపుతో మావోయిస్టులు బయటికి వస్తున్నారని చెప్పారు. శాంతియుత జీవనానికి ముందుకు వచ్చే వారికి ప్రభుత్వం అందుబాటులో ఉన్న ప్రతి విధమైన సహాయాన్ని అందిస్తుందని స్పష్టం చేశారు. మీడియా, ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నాయకులు.. ఇలా ఎలాంటి మార్గంలో వచ్చినా మేము స్వాగతిస్తాం అని ఆయన వెల్లడించారు. మావోయిస్టుల లొంగుబాటుకు పార్టీ అంతర్గత విబేధాలు, ఆరోగ్య సమస్యలు, వ్యక్తిగత పరిస్థితులు కూడా కారణమవుతున్నాయని డీజీపీ పేర్కొన్నారు.

లొంగిపోయిన వారిలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆజాద్ (సాంబయ్య) ఉన్నాడు. ములుగు జిల్లాకు చెందిన ఆజాద్ గత 30 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న ప్రముఖ నేత. అతనిపై రూ.20 లక్షల రివార్డు ఉంది. అదేవిధంగా అప్పాసి నారాయణపై కూడా రూ.20 లక్షల రివార్డు ఉందని తెలిపారు. ఇప్పుడు లొంగిపోయిన వారికి ఒక్కొక్కరికి రూ.25 లక్షల నగదు రివార్డు ఇస్తున్నట్లు డీజీపీ వెల్లడించారు. మొత్తం 37 మందికి కలిపి రూ.1.41 కోట్లు రివార్డ్‌ల రూపంలో ప్రభుత్వం ఇవ్వనుంది.

గత పదకొండు నెలల్లో మొత్తం 465 మంది మావోయిస్టులు లొంగిపోయారన్నారు డీజీపీ. ఇంకా 59 మంది తెలంగాణకు చెందిన మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం కేంద్ర కమిటీ (Central Committee)లో మొత్తం 9 మంది సభ్యులు ఉన్నారు. వారిలో 5 మంది తెలంగాణకు చెందిన వారే అని ఆయన అన్నారు. అదేవిధంగా 10 మంది స్టేట్ కమిటీ సభ్యులు కూడా ఉన్నట్లు డీజీపీ వివరించారు. కేంద్ర కమిటీ లో తెలంగాణ నాయకులు ముప్పల లక్ష్మణ్ అలియాస్ గణపతి, మలా రాజిరెడ్డి అలియాస్ సంగ్రాం, తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ, గణేష్, దామోదర్ ఉన్నట్లు తెలిపారు.

Alluri District : అల్లూరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీ మొత్తం అలెర్ట్‌!

Exit mobile version