తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సామాజిక భద్రత పెన్షన్లు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా, పెన్షన్ల పంపిణీలో పారదర్శకతను పెంచేందుకు ప్రవేశపెట్టిన ‘లైవ్ అథెంటికేషన్’ ప్రక్రియ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా వేగవంతమైంది. సాంకేతికత సహాయంతో అనర్హులను ఏరివేస్తూ, నిజమైన పేదలకు లబ్ధి చేకూర్చేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
లక్ష మందికి పైగా అనర్హుల గుర్తింపు..
గత కొంతకాలంగా సాగుతున్న క్షేత్రస్థాయి పరిశీలనలు, లైవ్ అథెంటికేషన్ ప్రక్రియ ద్వారా రాష్ట్రంలో దాదాపు లక్ష మందికి పైగా అనర్హులు పెన్షన్లు పొందుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. మరణించిన వారి పేరిట ఇంకా పెన్షన్లు డ్రా చేయడం, ఒకే ఇంట్లో ఇద్దరు పొందడం, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఆర్థిక స్థోమత ఉన్నప్పటికీ లబ్ధి పొందడం వంటి అక్రమాలను ఈ సరికొత్త విధానం ద్వారా పట్టుకున్నారు. ఈ అనర్హుల పేర్లను లబ్ధిదారుల జాబితా నుంచి శాశ్వతంగా తొలగించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది.
కొత్తగా 3 లక్షల మందికి పెన్షన్ల పంపిణీ..
అనర్హుల తొలగింపు ద్వారా ప్రభుత్వ ఖజానాపై పడే అదనపు భారం తగ్గడమే కాకుండా.. ఆ నిధులను అర్హులకు మళ్లించే అవకాశం దక్కింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం అర్హులైన సుమారు 2 లక్షల మంది లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది.
దీనికి అదనంగా.. ఇప్పుడు తాజాగా గుర్తించిన లక్ష మంది అనర్హుల స్థానంలో మరో లక్ష మంది కొత్త అర్హులను ఎంపిక చేయనున్నారు. ఫలితంగా.. రాష్ట్రంలో కొత్తగా పెన్షన్లు అందుకోబోయే లబ్ధిదారుల సంఖ్య ఏకంగా మూడు లక్షలకు చేరే అవకాశం ఉంది.
పారదర్శకత వైపు అడుగులు..
లైవ్ అథెంటికేషన్ విధానం ద్వారా నిజమైన లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, కేవలం అర్హత లేని వారిని మాత్రమే తొలగిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే కొత్త పెన్షన్ల మంజూరుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా నేరుగా పేద ప్రజలకే అందేలా చేయడంలో ఈ వినూత్న ప్రక్రియ ఎంతగానో దోహదపడుతోంది.

